బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవిలో సిద్ధరామయ్య ఉన్నా, లేకున్నా కాంగ్రెస్ (ప్రభుత్వం) కొనసాగుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కేసులో సిద్ధూ తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ కేసులో సిద్ధూపై ఆరోపణలు ఇప్పటి వరకు రుజువు కాలేదన్నారు.
గోద్రా సంఘటన జరిగినపుడు గుజరాత్ సీఎం పదవికి నరేంద్ర మోదీ రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు. అదే సమయంలో అమిత్ షాపై అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. పరువు, ప్రతిష్ఠలను దెబ్బ తీయడం కోసం ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయవద్దని హితవు పలికారు. వారి (బీజేపీ) ఉద్దేశం కాంగ్రెస్ను దెబ్బ తీయడమే కానీ, ఓ వ్యక్తి కాదని చెప్పారు.
కేవలం కాంగ్రెస్ను నాశనం చేయడం కోసం, దాని ఓటు బ్యాంకును దెబ్బ తీయడం కోసం బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. చట్టాన్ని తన పనిని తాను చేయనివ్వండన్నారు. సమయం వచ్చినపుడు తాము పరిశీలిస్తామన్నారు. ఇప్పటి వరకు సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఏమీ లేదని చెప్పారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొందరు పారిశ్రామికవేత్తలు చెల్లించాల్సిన రూ.16 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసిందని, దానితో పోల్చితే ముడా కుంభకోణం చాలా చిన్న విషయమని చెప్పారు.సిద్ధరామయ్య పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నందువల్ల ఆయనకు తాము అండగా ఉంటామని తెలిపారు.