న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల మద్దతుతో తాను పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టానని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో గురువారం జరిగిన మహిళా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యుల సమావేశంలో ఖర్గే మాట్లాడారు.
ఈ భేటీలో కాంగ్రెస్ చీఫ్ తన ప్రస్ధానాన్ని గుర్తుచేసుకుంటూ పార్టీలో తాము చేసిన సేవలకు గుర్తింపు లభిస్తే ఆయా నేతలు సంతృప్తి చెందుతారని అన్నారు. 1969లో తాను బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని అయ్యానని, ఆపై రెండేండ్లలో ఎమ్మెల్యేలగా ఎన్నికయ్యానని చెప్పుకొచ్చారు. అప్పటినుంచి తాను తలపడిన ఏ ఎన్నికల్లోనూ ఓటమి చెందలేదని చెప్పారు. పార్టీలో కొన్ని ఆటుపోట్లు ఎదురైనా సోనియా గాంధీ తనపై విశ్వాసం ఉంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారని తెలిపారు.
తనపై విశ్వాసం కనబరిచిన సోనియాకు తాను ఎన్నడూ రుణపడి ఉంటానని అన్నారు. సోనియా, రాహుల్ మద్దతు లేకుంటే తాను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎదిగేవాడిని కాదని స్పష్టం చేశారు. మోదీ సారధ్యంలోని బీజేపీ సర్కార్‌పై ఖర్గే విమర్శలు గుప్పిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిని జైలుకు పంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
మోదీ పాలనపై విమర్శలు చేసిన వారిపై కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. నేతలను జైళ్లకు పంపి, వారిపై తప్పుడు కేసులు నమోదు చేయడం కాషాయ నేతలకు అలవాటుగా మారిందని అన్నారు. నిజాలు మాట్లాడినందుకు ఎందరినో జైళ్లకు పంపుతున్నారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు.
Read More :