బెంగళూరు, సెప్టెంబర్ 7: వర్షాలకు పంట నీట మునిగి నష్టపోయానని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరడానికి వచ్చిన ఒక రైతుకు ఉపశమనం లభించకపోగా.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతిలో చీవాట్లు తిన్నాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతున్నది. కలబురిగిలోని ఖర్గే ఇంటికి ఒక రైతు వచ్చి ఇటీవలి వర్షాలకు తాను వేసిన నాలుగు ఎకరాల్లోని పంట దెబ్బతిందని విన్నవించుకున్నాడు. దీంతో ‘నీవి నాలుగు ఎకరాలే పోయాయి.
నావి అంతకన్నా ఎక్కువగా 40 ఎకరాలు పోయాయి. ఇది ఎలా ఉందంటే ముగ్గురు పిల్లలున్న వ్యక్తి ఆరుగురు సంతానం ఉన్న వ్యక్తి వద్దకు వచ్చి కష్టాలు చెప్పుకున్నట్టు ఉంది’ అంటూ ఆ వ్యక్తిని మందలించాడు. పైగా ‘ఊరికే ప్రచారం కోసం ఇక్కడకు రావొద్దు. దీని గురించి నాకంతా తెలుసు.
ఈ ఏడాది పంటల నష్టం గురించి నాకు అవగాహన ఉంది’ అంటూ అవమానించాడు. అంతేకాకుండా మీకు తక్కువ నష్టం కాబట్టి తట్టుకోగలరు. పెద్దమొత్తంలో నష్టపోయిన మాలాంటి వారికి ఇది చాలా కష్టం అని ఖర్గే పేర్కొన్నారు. కాగా, పంట నష్టం గురించి చెప్పుకోవడానికి వచ్చిన రైతు పట్ల ఖర్గే దురుసుగా వ్యవహరించిన తీరుపై విపక్షాలు, ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు.