Mallikarjun Kharge : ముడా స్కామ్‌లో కర్నాటక సీఎం సిద్ధరామయ్య కష్టాల్లో కూరుకుపోతే కర్నాటకలో కాంగ్రెస్‌ను తాజాగా మరో వ్యవహారం ఇరుకునపెడుతోంది. బెంగళూర్‌కు సమీపంలోని ఓ ఏరోస్పేస్ పార్క్‌లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుటుంబానికి చెందిన ఓ ట్రస్ట్‌కు 5 ఎకరాల భూ కేటాయింపునకు ఆమోదం లభించడం పెను దుమారం రేపుతోంది. ఖర్గే కుమారుడు రాహుల్ ఈ ట్రస్ట్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్ట్‌కు కర్నాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి బోర్డు (KIADB) స్ధల కేటాయింపు అధికార దుర్వినియోగమని, కర్నాటక సర్కార్ బంధుప్రీతికి సంకేతమని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వీయ ట్వీట్ చేశారు.
ఈ ఉదంతంపై ఖర్గే సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. ఐదు ఎకరాల భూమిని ఎస్సీ కోటా కింద సిద్ధార్ధ విహార్ ట్రస్ట్‌కు కట్టబెట్టారని, ఈ ట్రస్ట్ కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అల్లుడు, కలబురగి ఎంపీ రాధాకృష్ణ, కుమారుడు రాహుల్ ఖర్గే ఇతర కుటుంబసభ్యులు నిర్వహిస్తున్నారని మాల్వీయ పేర్కొన్నారు. హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్ కోసం కేఐఏడీబీ పక్కనపెట్టిన 45.94 ఎకరాల స్ధలంలో ఈ 5 ఎకరాలు భాగమని వివరించారు. స్ధలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని సామాజిక కార్యకర్త దినేష్ కలహళ్లి కర్నాటక గవర్నర్ తావర్ చంద్ గహ్లాట్‌కు ఫిర్యాదు చేశారు.
కర్నాటక పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్‌పై రాష్ట్ర లోకాయుక్తకు ఫిర్యాదు చేసేందుకు ఆయన ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలని కూడా గవర్నర్‌ను దినేష్ కోరారు. మరోవైపు ఈ ఆరోపణలను ఎంబీ పాటిల్ తోసిపుచ్చుతూ రాహుల్ ఖర్గే అర్హుడైన దరఖాస్తుదారుడని పేర్కొన్నారు. సింగిల్ విడో అనుమతి ద్వారా స్ధలం కేటాయింపుకు ఆమోదం లభించిందని వివరించారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని, జనరల్ క్యాటగిరీ నిబంధనల కింద లబ్ధిదారులు పూర్తి మొత్తం చెల్లించారని చెప్పారు. రాహుల్ ఖర్గేకు అంత సులభంగా స్ధలం ఎలా కేటాయించారని, అధికారులు ఈ విషయంలో పక్షపాత వైఖరితో వ్యవహరించారని దినేష్ కలహళ్లి ఆరోపించారు.
Read More :
Trisha | తొలిసారి ప్రత్యేకగీతంలో త్రిష.. ఏ సినిమాలో అంటే?