Trisha | సుదీర్ఘమైన కెరీర్లో అగ్ర కథానాయిక త్రిష ఇప్పటివరకు ప్రత్యేకగీతాల్లో నర్తించలేదు. ఆమె సమకాలీన నాయికలు చాలా మంది స్పెషల్ సాంగ్స్‌లో మెరిసి అభిమానులను అలరించారు. తాజా సమాచారం ప్రకారం త్రిష తొలిసారి ప్రత్యేకగీతంలో నటించినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతున్నది.
వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్, దేశభక్తి ప్రధానాంశాలుగా తెరకెక్కిస్తున్నారు. విజయ్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారు. ఈ సినిమాలో త్రిష అతిధి పాత్రలో నటిస్తుందని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. తాజాగా ఆమె ఓ స్పెషల్‌సాంగ్‌లో నటించిందని దర్శకుడు వెంకట్‌ప్రభు వెల్లడించారు. త్వరలో ఈ పాటను విడుదల చేస్తామని ఆయన అన్నారు.
తమిళంలో విజయ్-త్రిష హిట్‌పెయిర్‌గా గుర్తింపుతెచ్చుకున్నారు. వారిద్దరు కలిసి ఐదు చిత్రాల్లో నటించగా.. అవన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించాయి. దాంతో హిట్ సెంటిమెంట్‌ను గౌరవిస్తూ వారిద్దరిపై ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేశారని తెలిసింది. ‘గోట్’ తెలుగు వెర్షన్‌ను అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తున్నది.