కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఫ్రిబవరి 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు సమాచారం. రెండు వేల మందితో కేంద్ర బలగాలను పెద్ద ఎత్తున మోహరించి అధికారులు కూంబింగ్ చేపటారు. ఆ ప్రాంతంలో మావోయిస్టు అగ్ర నేతలున్నారని నిఘాల వర్గాల ద్వారా వచ్చిన సమాచారం మేరకు గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, కోబ్రా, డీజీఎఫ్ బలగాలు మోహరించి కర్రెగుట్టలను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో డోలీ-జెల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పులు జరిపారు.
వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులకు దిగడంతో ఇరువర్గాల మధ్య హోరాహోరీగా పోరు జరిగినట్లు తెలుస్తున్నది. భద్రతా దళాలు చుట్టుముట్టడంతో వారి ధాటికి తాళలేక మావోయిస్టులు అక్కడి నుంచి అటవీ మార్గంలోకి పారిపోయారు. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తున్నది. మృతుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు.