కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్న విమర్శల నేపథ్యంలో సుదీర్ఘ కసరత్తు తర్వాత తన క్యాబినెట్లో ప్రధాని నరేంద్రమోదీ భారీ మార్పులు చేర్పులు చేశారు. 2019లో మోదీ రెండోసారి అధికారం చేపట్టాక తొలిసారిగా బుధవారం మంత్రిమండలిని విస్తరించారు. హర్షవర్ధన్, రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, రమేశ్ పోఖ్రియాల్ వంటి సీనియర్లతో సహా 12 మంది మంత్రులకు ఉద్వాసన పలికారు. మాజీ సీఎంలు శర్బానంద సోనోవాల్, నారాయణ్ రాణెతోపాటు, ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు క్యాబినెట్ మంత్రులుగా చోటిచ్చారు. కిషన్‌రెడ్డి, కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్‌తోపాటు ఏడుగురికి క్యాబినెట్ మంత్రులుగా పదోన్నతి లభించింది. కొత్త ముఖాలు, పదోన్నతి పొందినవారితో కలిపి 15 మంది క్యాబినెట్ మంత్రులుగా, మరో 28 మంది సహాయ మంత్రులుగా బుధవారం సాయంత్రం ప్రమాణంచేశారు. దీంతో కేంద్ర క్యాబినెట్లో మంత్రుల సంఖ్య 78కి చేరింది.
న్యూఢిల్లీ, జూలై 7: నెల రోజుల కసరత్తు తర్వాత కేంద్ర క్యాబినెట్లో ప్రధాని నరేంద్రమోదీ భారీ మార్పులు చేర్పులు చేశారు. 2019లో మోదీ రెండోసారి అధికారం చేపట్టాక తొలిసారిగా బుధవారం క్యాబినెట్‌ను విస్తరించారు. ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, ఐటీ, న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్, సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, విద్యా మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వంటి కీలక అమాత్యులతో పాటు 12 మంది మంత్రులకు ఉద్వాసన పలికారు. శర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, నారాయణ్ రాణెని క్యాబినెట్ మంత్రులుగా తీసుకున్నారు. కొత్త ముఖాలు, పదోన్నతి పొందినవారితో కలిపి 15 మంది క్యాబినెట్ మంత్రులుగా, మరో 28 మంది సహాయ మంత్రులుగా బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాలులో జరిగిన కార్యక్రమంలో ప్రమాణం చేశారు. దీంతో కేంద్ర క్యాబినెట్లో మంత్రుల సంఖ్య 78కి చేరింది. నిన్నటి వరకు మంత్రుల సంఖ్య 53గా ఉంది. కొత్త, పదోన్నతి పొందిన మంత్రులతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పలువురు మంత్రులు పాల్గొన్నారు. మొదట మహారాష్ట్ర మాజీ సీఎం, రాజ్యసభ సభ్యుడు రాణె, ఆయన తర్వాత అస్సాం మాజీ సీఎం సోనోవాల్ ప్రమాణం చేశారు. రెండేండ్ల క్రితం కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మధ్యప్రదేశ్ నేత సింధియాకు కూడా క్యాబినెట్ పదవి లభించింది. బీజేపీ ఎంపీలు వీరేంద్రకుమార్ (మధ్యప్రదేశ్), అశ్విని వైష్ణవ్ (ఒడిశా), జేడీయూ ఎంపీ ఆర్సీపీ సింగ్ (బీహార్), బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేంద్రయాదవ్, ఎల్జేడీ రెబెల్ నేత, ఎంపీ పశుపతి కుమార్ పరాస్ కూడా క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. కిరణ్ రిజిజు, ఆర్కే సింగ్, హర్దీప్ సింగ్ పురీ, మన్సుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాల, కిషన్‌రెడ్డి, అనురాగ్ ఠాకూర్‌కు సహాయ మంత్రుల నుంచి క్యాబినెట్ మంత్రులుగా పదోన్నతి లభించింది. యువ నేతలకు మోదీ పదవులు ఇచ్చారని, వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
విమర్శలు.. సమీక్షల తర్వాత…
బుధవారం నాటి విస్తరణ కోసం ప్రధాని మోదీ నెల రోజులకు పైగా సుదీర్ఘ సమీక్షలు జరిపారు. బీజేపీ ముఖ్యనేతలతో పలుదఫాలు సమావేశాలు నిర్వహించారు. కరోనా సంక్షోభం నిర్వహణలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్న తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో మోదీ ఈ సమీక్షలు జరుపడం గమనార్హం. తదనంతర విస్తరణలో కీలక మంత్రులను తప్పించారు. ఇలా తప్పించడం ప్రభుత్వం తన వైఫల్యాన్ని అంగీకరించడమేనంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి. ప్రభుత్వంలో మార్పు తీసుకొచ్చామన్న భావనను ప్రజల్లో కలిగించడమే తాజా విస్తరణ లక్ష్యమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
యూపీకి పెద్దపీట
సహాయమంత్రులుగా ప్రమాణం చేసిన 28 మందిలో ఏడుగురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే. వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటంతో పదవుల పందేరం జరిపారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌కు 3 చొప్పున, బెంగాల్, కర్ణాటకకు 4 చొప్పున పదవులు దక్కాయి. ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ ఆ రాష్ట్ర నేతలకు ప్రాధాన్యం ఇచ్చింది. క్యాబినెట్లో చోటుదక్కిన 16 మంది తొలిసారి ఎంపీలుగా ఎన్నికైనవారు.
మరో ఏడుగురు మహిళా మంత్రులు
మీనాక్షి లేఖి, శోభా కరంద్లాజే, అనుప్రియ సింగ్ పటేల్ సహా ఏడుగురు మహిళలకు కేంద్ర క్యాబినెట్లో స్థానం లభించింది. వీరితో కలిపి మహిళా మంత్రుల సంఖ్య 11కు చేరింది. కొత్తగా మంత్రుల్లో దర్శనా జర్దోష్, అన్నపూర్ణాదేవి, ప్రతిమా భౌమిక్, భారతీ పవార్ కూడా ఉన్నారు. ఏడుగురిలో ముగ్గురు తొలిసారి ఎంపీలుగా ఎన్నికైనవారు. అప్నా దళ్‌కు చెందిన అనుప్రియ గతంలో కూడా మోదీ మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. కాగా, తమిళనాడు బీజేపీ నేత మురుగన్ ఒక్కరే ఎంపీగా ఎన్నిక కాకపోయినా మంత్రి పదవి లభించింది.
కూచ్‌బిహార్ ఎంపీ అందరికంటే చిన్న
కేంద్ర క్యాబినెట్ పునర్వ్యస్థీకరణ తర్వాత మంత్రుల సగటు వయస్సు 61 ఏండ్ల నుంచి 58 ఏండ్లకు తగ్గింది. బెంగాల్‌లోని కూచ్‌బిహార్ ఎంపీ నితీశ్ ప్రమాణిక్(35) ప్రస్తుత క్యాబినెట్లో అతి పిన్న వయస్కుడు. పంజాబ్‌లోని హోషియాపూర్ ఎంపీ సోంప్రకాశ్ (72) అతిపెద్ద వయస్కుడు. బుధవారం ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల సగటు వయస్సు 56 ఏండ్లు.