Maharashtra | మహారాష్ట్ర ముఖ్యమంత్రి (Maharashtra CM) అభ్యర్థిపై అనిశ్చితి కొనసాగుతోంది. ఇటీవలే జరిగిన శాసనసభ ఎన్నికల్లో మహాయుతి (Mahayuti) కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు మహా సీఎం పీఠం ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై గత రెండు రోజులుగా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.
నేటితో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుంది (Maharashtra assembly term ends today). ఈలోగా ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేయాల్సిన అనివార్యత ఉంది. అయినప్పటికీ ఇంతవరకూ సీఎం అభ్యర్థిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతలు ముఖ్యమంత్రి పదవిపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో అధిక సీట్లు సాధించిన బీజేపీనే సీఎం పదవి చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ లెక్కన ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీసే (Devendra Fadnavis) సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అజిత్ పవార్ కూడా ఫడ్నవీస్‌కే మద్దతు తెలిపినట్లు సమాచారం. అదే సమయంలో ఏక్నాథ్ షిండే (Eknath Shinde)ను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని శివసేన గట్టిగా పట్టుబడుతున్నది. దీంతో ఈ వ్యవహారం మహా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సోమవారం ఉంటుందని మొదట్లో ప్రచారం జరిగింది. కానీ మహాయుతి నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అది సాధ్యం కాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు వార్తలు రాగానే, శివసేన నేతలు ఘాటుగా స్పందించారు. సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేసినందువల్ల ఆయననే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలావుండగా, లోక్ సభ సభాపతి ఓం బిర్లా కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురూ బీజేపీ అగ్ర నేతలతో సమావేశమై ప్రతిష్టంభనకు తెర దించే అవకాశం ఉంది. ఏది ఏమైనా నేటితో అసెంబ్లీ గడువు ముగియనుండటంతో.. ఈ రాత్రికి సీఎం అభ్యర్థిపై ఓ స్పష్టత రావడం ఖాయం. అప్పటి వరకూ వేచి చూడాల్సిందే. ఈ నెల 20న జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 132, శివసేనకు 57, ఎన్సీపీకి 41 స్థానాలు లభించిన విషయం తెలిసిందే.
Also Read..
Shailaja | పోలీసుల వలయంలో శైలజ స్వగ్రామం.. ఎమ్మెల్యే కోవా లక్ష్మి అడ్డగింత
Bull Attack: యూపీలో ఎద్దు బీభత్సం.. 15 మందికి గాయాలు.. 3 గంటలు ఛేజింగ్