మహావీర సంతోష్

న్యూఢిల్లీ హైదరాబాద్, సూర్యాపేట, జనవరి 25 (నమస్తే తెలంగాణ): గల్వాన్‌లోయలో చైనా సైన్యానికి ఎదురొడ్డి పోరాడి వీరమరణం పొందిన తెలంగాణ ముద్దుబిడ్డ.. కర్నల్ సంతోష్‌బాబుకు అత్యున్నత సైనిక పురస్కారాల్లో రెండవదైన మహావీర చక్రను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం రిపబ్లిక్ వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ పురస్కారాన్ని సంతోష్‌బాబు భార్య సంతోషికి ప్రదానం చేయనున్నారు. సంతోష్‌తోపాటు నాడు గల్వాన్ ఘర్షణలో అమరులైన మరో నలుగురు సైనికులు నాయబ్ సుబేదార్ నాథూరామ్ సోరేన్, హవిల్దార్ కే పళని, నాయక్ దీపక్ సింగ్, సిపాయి గురుతేజ్సింగ్లతో పాటు హవల్దార్ తాజీందర్ సింగ్‌కు వీరచక్ర అవార్డులను ప్రకటించారు. గతేడాది జూన్ 15వ తేదీన జరిగిన గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది సైనికులు అమరులయ్యారు. జమ్ముకశ్మీర్‌లో గతేడాది ఏప్రిల్ 4న ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన సుబేదార్ సంజీవ్‌కుమార్‌కు కీర్తి చక్ర అవార్డు ప్రకటించారు. ఉగ్రవాదుల నుంచి పౌరుల ప్రాణాలను కాపాడే క్రమంలో అమరుడైన మేజర్ అనూజ్ సూద్‌తో పాటు ప్రణబ్ జ్యోతిదాస్, సోనమ్ షెరింగ్ తమాంగ్లకు శౌర్య చక్ర అవార్డులను ప్రకటించారు.
చిన్న వయస్సులోనే పోస్టింగ్
సంతోష్‌బాబు సూర్యాపేట లో ప్రైమరీ విద్య చదివి 6 నుంచి 12వ తరగతి వరకు కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో పుణెలో డిగ్రీ పూర్తి చేసిన అనంతరం డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో ఆర్మీ శిక్షణ పూర్తిచేశారు. 2004 డిసెంబర్ 10న జమ్ములో మిలటరీ అధికారిగా తక్కువ వయసులోనే పోస్టింగ్ రాగా 15 ఏళ్ల సర్వీసు అనంతరం 2019 డిసెంబర్లో కర్నల్‌గా ప్రమోషన్ వచ్చింది.
పరమ వీరచక్ర ఇస్తారనుకున్నాం
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మహావీరచక్ర పురస్కారం ద్వారా తమ కుమారుడి త్యాగం, ధైర్యసాహసాలకు న్యాయం జరుగలేదని కర్నల్ సంతోష్‌బాబు తండ్రి ఉపేందర్ అన్నారు. ‘సంతోష్‌బాబుకు పరమవీరచక్ర ఇస్తారని అనుకొన్నాం’ అని పేర్కొన్నారు.
గల్వాన్‌లో సింహగర్జన
గల్వాన్ ప్రాంతంలో విధుల్లో ఉన్న నిర్వహిస్తున్న ‘16 బీహార్' రెజి మెంట్‌కు సంతోష్‌బాబు కమాండింగ్ అధికారి. గల్వాన్ లోయలో చైనా శిబిరాన్ని ఖాళీ చేయించేందుకు సంతోష్ బాబు నేతృత్వంలోని బృందం జూన్ 15న చైనా శిబిరం వద్దకు వెళ్లింది. చైనా సైనికులు సంతోష్‌ను తోశారు. కమాండింగ్ అధికారిపై చైనా జులుం ప్రదర్శించడంతో సైనికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొన్నది. పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. చైనా గుడారాలను పీకేశారు. భయంతో డ్రాగన్ దళాలు వెనుదిరిగాయి. సింహంలా పోరాడిన సంతోష్ సంతోష్ తీవ్రంగా గాయపడ్డారు. అయినా వెనక్కు వెళ్లేందుకు నిరాకరించారు. గాయపడినవారిని వెనక్కు పంపారు. అదనపు బలగాలను రప్పించారు. కొద్ది సేపటి తర్వాత చైనా సైనికులు అదనపు బలగాలతో అక్కడికి చేరుకొన్నారు. పొడవైన మేకులు కలిగిన ఇనుపకడ్డీలతో మన సైనికులపై దాడులు చేశారు. చైనా సైనికులు భారీ సంఖ్యలో ఉన్నప్పటికీ సైనికులు భీకర పోరాటం చేశారు. గల్వాన్ ఒడ్డున పర్వతాలపై మాటు వేసిన చైనా బలగాలు అక్కడికి వచ్చాయి. భారత సైనికులపై రాళ్ల వర్షం కురిపించాయి. సంతోష్ తలపై పెద్ద రాయి పడింది. దీంతో ఆయన నదిలోకి ఒరిగిపోయారు.
కుటుంబానికి అండగా తెలంగాణ ప్రభుత్వం
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం బాసటగా నిలిచింది. ఆయన కుటుంబానికి ఐదు కోట్ల నగదు, హైదరాబాద్‌లో 711 చదరపు గజాల ఇంటి స్థలంతోపాటు సంతోష్‌బాబు భార్య సంతోషికి డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం ఇచ్చింది. సూర్యాపేటలోని ఓ చౌరస్తాకు సంతోష్‌బాబు చౌక్‌గా నామకరణం చేశారు. సంతోష్‌బాబు సతీమణి సంతోషి యాదాద్రి భువనగిరి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
- నాగార్జున నిర్మాణంలో వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం..!
- ఐదు రాష్ట్రాల్లో నేడు మోగనున్న ఎన్నికల నగారా..!
- గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ పోలీస్
- బెంగాల్లో స్మృతి ఇరానీ రోడ్ షో..!
- చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ 75 నిమిషాల సంభాషణ
- గజకేసరిగా యష్ ..సాయంత్రం చిత్ర టీజర్ విడుదల
- రెండు తలల దూడకు జన్మనిచ్చిన బర్రె.. ఎక్కడో తెలుసా?
- బీజేపీని సవాల్ చేస్తున్నది ఆమ్ ఆద్మీ పార్టీయే : కేజ్రీవాల్
- శ్రీవారికి పోస్కో భారీ విరాళం
- బ్రెజిల్‌కు రెండు కోట్ల కోవాగ్జిన్ టీకా డోసులు