కొట్టాయం (కేరళ), డిసెంబర్ 24: ఇంతకాలం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు ఇచ్చే మాతృత్వ సెలవులు దేశంలో తొలిసారిగా తమ విద్యార్థినులకు సైతం ఇవ్వనున్నట్టు కేరళలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రకటించింది. యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థినులు గర్భం దాలిస్తే 60 రోజుల పాటు మెటర్నిటీ లీవ్‌ను మంజూరు చేయాలని వీసీ అరవింద్ కుమార్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది.
విద్యార్థినుల విద్యా సంవత్సరం వృథా కాకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వీసీ తెలిపారు. 18 పైబడి డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థినులు గర్భం దాలిస్తే 60 రోజుల మాతృత్వ సెలవును ప్రసవానికి ముందు కానీ, తర్వాత కానీ తీసుకోవచ్చు. అయితే ఇది మొదటిసారి కాని, రెండోసారి కాని గర్భం దాల్చిన వారు మాత్రమే వినియోగించుకోవచ్చు. అలాగే కోర్సు సమయంలో ఒకసారి మాత్రమే ఈ సెలవు మంజూరు చేస్తారు.