ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు నిరసన సెగ తగిలింది. మహారాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఆర్టీసీ ఉద్యోగులు మహారాష్ట్రలో డిమాండ్ చేస్తున్నారు. అయితే.. తమ విషయాన్ని శరద్ పవార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకొని, పవార్ ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. మరికొందరు పవార్ నివాసంలోకి షూలను విసిరి కొట్టారు. దీంతో.. పవార్ కుమార్తె సుప్రియా సూలే… నిరసనకారులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా.. వారు ఏమాత్రం వినలేదు.
గత యేడాది నవంబర్ నుంచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్‌ను పట్టించుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారందరూ పవార్ ఇంటి ముందు నిరసనకు దిగారు. సమ్మె సమయంలో 120 మంది ఆర్టీసీ ఉద్యోగులు సూసైడ్ చేసుకున్నారు. ఇవేవీ ఆత్మహత్యలు కావు. ప్రభుత్వ హత్యలే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న తమ డిమాండ్‌పై వెనక్కి తగ్గం. ఈ సమస్యను పరిష్కరించడానికి శరద్ ఏమాత్రం ప్రయత్నాలు చేయడం లేదు అంటూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.