ముంబై: భారీగా అప్పులుచేశారని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేసే బీజేపీ.. ఆ పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో మాత్రం రాష్ట్ర ఆర్థికాన్ని భ్రష్టుపట్టించింది. కాంట్రాక్టర్లకు సుమారు లక్ష కోట్ల మేర బిల్లులను చెల్లించలేదు. దీంతో వారు నిరసనలకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులను చెల్లించకుంటే ఫిబ్రవరి 5 నుంచి సమ్మెకు దిగుతామని మహారాష్ట్ర రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం(ఎంఎస్సీఏ) హెచ్చరించింది. ప్రజా పనుల విభాగం నుంచి అత్యధికంగా రూ.46 వేల కోట్లు కాంట్రాక్టర్లకు రావాల్సి ఉందని ఎంఎస్సీఏ అధ్యక్షుడు మిలింద్ భోసలే తెలిపారు.
గత 8 నెలలుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో మౌలిక, అభివృద్ధి రంగాల్లోని సుమారు 4 లక్షల కాంట్రాక్టర్లు, 4 కోట్ల కార్మికులు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా సమస్యలను పట్టించుకోకుండా, ప్రచారం కోసం ప్రభుత్వం ఉచితాల పంపిణీ పైన దృష్టి సారించింది’ అని ఆయన ఆరోపించారు. చాలామంది చిన్న కాంట్రాక్టర్లు, నిరుద్యోగ యువత అభివృద్ధి ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టారని.. కానీ బిల్లుల మంజూరులో ఆలస్యం వారి మానసిక ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా బిల్లుల చెల్లింపు ఆలస్యమైందని రాష్ట్ర పట్టణ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి యోగేశ్ కదమ్ వివరణ ఇచ్చారు.