Maharashtra | ముంబై : ఈ ఏడాది చివర్లో జరిగే మహారాష్ట్ర ఎన్నికలకు పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి. 288 స్థానాలున్న అసెంబ్లీకి అక్టోబర్లో ఎన్నికలు జరగవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) అధ్యక్షుడు శరద్ పవార్ శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి అధికార నివాసంలో వీరిరువురి భేటీ జరిగింది. మరాఠా రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు చర్చల్లో ప్రస్తావించినట్టు పైకి చెప్పినా, వీరి భేటీ పూర్తిగా రాజకీయాలకు సంబంధించినదేనని భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు వీరిద్దరూ ఇలా కలుసుకోవడం అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పొత్తులకు ఏమన్నా తెరతీస్తారా అన్న చర్చలు ప్రారంభమయ్యాయి.
గత కొద్ది సంవత్సరాలుగా మహారాష్ట్రలో అస్థిర ప్రభుత్వం అధికారంలో ఉండటం, తరచూ అధికారం చేతులు మారటంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఓటింగ్ ద్వారా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ పార్టీపై బీజేపీ చూపుతున్న వైఖరి పట్ల షిండే వర్గం అసంతృప్తితో ఉంది. బీజేపీతో బంధం తెంపుకుని శరద్పవార్తో కలిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని షిండే పరిశీలించారని, అందులో భాగంగానే షిండే, పవార్ల భేటీ జరిగిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.