ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. బుధవారం కొత్తగా 2,701 కేసులు నమోదయ్యాయి. నాలుగు నెలల్లో ఇదే అత్యధిక సంఖ్య. సోమవారం (1,036) కంటే మంగళవారం కేసుల నమోదు 80 శాతంపైగా ఉంది. 1,881 కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 18 తర్వాత ఇదే గరిష్ఠం. కాగా, బుధవారం బీ.ఏ.5 వేరియంట్ కేసు ఒకటి నమోదైంది. 31 ఏళ్ల మహిళకు సోకింది. అయితే బుధవారం ఆ రాష్ట్రంలో ఎలాంటి కరోనా మరణాలు నమోదు కాలేదు. యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య సుమారు పది వేలకు చేరింది. మొత్తం కరోనా కేసులు 78,98,815కు, మొత్తం మరణాలు 11,47,866కు పెరిగాయి.
మరోవైపు రాజధాని మంబైలో కూడా కరోనా విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో 42 శాతం మేర కేసులు పెరిగాయి. బుధవారం కొత్తగా 1,765 కేసులు నమోదయ్యాయి. సోమవారం 676 నమోదు కాగా, మంగళవారం దీనికి రెట్టింపులో గరిష్ఠంగా 1,242 కేసులు రికార్డయ్యాయి. మరోసారి కరోనా కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా టెస్ట్‌లను పెంచాలని జిల్లా అధికారులను ఆదేశించింది. అలాగే మాస్కులు ధరించాలని పౌరులను కోరింది.