Maharashtra : మహారాష్ట్రను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వర్షాల కారణంగా అనేక చోట్లు చెట్లు విరిగిపడటం, ఇండ్లు కూలడం వంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో పలువురు గాయపడుతున్నారు. ఇప్పటికే ముంబైలో వర్షాల కారణంగా ముగ్గురు మరణించారు. తాజాగా మహారాష్ట్రలోని మిరా-భయందర్ పరిధిలో చెట్టు విరిగిపడి ఒక వ్యక్తి మరణించాడు. అతడు అక్కడి మాజీ డిప్యూటీ మేయర్ తనయుడు కావడం విశేషం. మృతుడి పేరు రాహుల్ అశోక్ పాటిల్ (35). అతడు ముర్దాగావ్లో ఉంటున్నాడు. రాహుల్ అశోక్ తండ్రి గతంలో మిరా-భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంబీఎంసీ) డిప్యూటీ మేయర్‌గా పని చేశారు.
ఘటనకు సంబంధించి.. సదానంద నగర్ ప్రాంతంలో గత బుధవారం సాయత్రం భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో రాహుల్ అశోక్ బైకుపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో భారీ వర్షం, గాలుల కారణంగా ఒక కొబ్బరి చెట్టు అతడిపై విరిగిపడింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. అయితే, తీవ్ర గాయాల కారణంగా రాహుల్ అశోక్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. ఈ ప్రాంతంలో వర్షం కారణంగా ఇటీవల సంభవించిన తొలి మరణంగా అధికారులు చెబుతున్నారు. ఇటీవల ముంబైలో కూడా ఒక స్కూల్ బస్సుపై చెట్టు పడటంతో ఒక బాలుడు మరణించిన సంగతి తెలిసిందే.
గుంతలోపడి రెండేళ్ల బాలుడు మృతి
మరోవైపు మహారాష్ట్రలోని పూనేలో దారుణం జరిగింది. పూనే జిల్లా, కందంవాస్తి పరిధిలోని లోని గ్రామ పంచాయతి పరిధిలో కాంట్రాక్టర్ తవ్విన ఒక గుంతలో పడి రెండేళ్ల బాలుడు మరణించాడు. ఈ ఘటన జూన్ 30న జరిగింది. రెండేళ్ల బాలుడు ఇంటినుంచి బయటకు నడుచుకుంటూ వచ్చాడు. ఇంటి సమీపంలో కాంట్రాక్టర్ తవ్వి, నిర్లక్ష్యంగా వదిలేసిన మూడు అడుగుల లోతున్న గుంటలో పడి ప్రాణాలు కోల్పోయాడు. భారీ వర్షాల కారణంగా ఈ గుంట నీటితో నిండిపోయింది. మురికి నీరు అంతా గుంటలో నిలిచిపోయింది. బాలుడు కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారంతా గాలించినా బాలుడి ఆచూకీ దొరకలేదు. చివరకు బాలుడి మృతదేహం ఆ గుంటలో లభ్యమైంది. దీంతో గుంటను తవ్వి నిర్లక్ష్యంగా వదిలేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు కోరుతున్నారు. పోలీసులు ఆ కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేశారు.