(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): బుల్లెట్ ట్రైన్ పేరుచెప్పి ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారం చేసుకొంటున్నారని, అలాంటి ఖరీదైన రైలులో ఏ పేదోడైనా ఎక్కుతాడా? అని మహారాష్ట్రలో పాలఘర్ జిల్లాలోని దహాను అంబేసరి, జంషేట్ తదితర గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బుల్లెట్ రైలు కోసం తమ పొలాలను తీసుకొన్న బీజేపీ సర్కారు తగిన పరిహారం కూడా ఇవ్వలేదని వాపోయారు.
భూములిచ్చిన రైతుల పిల్లల్లో అర్హులైన వారికి తగిన ఉద్యోగం ఇస్తామన్న సర్కారు అది కూడా చేయలేదని ధ్వజమెత్తారు. బుల్లెట్ రైలుతో పేదలైన రైతులకు ఏం ఉపయోగమని నిలదీశారు. మోదీ ఫొటోతో ‘ఫ్రీ రేషన్’ అని ముద్రించిన సంచీలను పంచారని, రేషన్ సరుకులు రాక ఏడాది దాటిపోయిందని వాపోయారు. బీజేపీ హయాంలో అభివృద్ధి అంటే ధనికులకు సంబంధించినదేనని, తమలాంటి పేదవాళ్లకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు.
బుల్లెట్ రైలు మేం ఎక్కుతామా?
బుల్లెట్ రైలుతో మాకు ప్రయోజనమేంటి? దాంట్లో మేమేమైనా ఎక్కి ప్రయాణించగలమా? ఆ తాహతు మాకు ఉందా?
-చందుబీమా, గిరిజన రైతు, దహాను గ్రామం
ఉద్యోగాలు ఇవ్వలే
బుల్లెట్ రైలు కోసమని మా భూములను బలవంతంగా లాక్కొన్నారు. తగిన అర్హతలు ఉన్నప్పటికీ మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలే.
– లడ్కూబాయ్ కోంబ్, గృహిణి, జంషేట్ గ్రామం