ముంబై: మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. (MVA Manifesto) కుల గణన, మహిళలకు నెలకు రూ.3,000 వంటి హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, శివసేన (యూటీబీ) నేత సంజయ్ రౌత్, ఎన్సీపీ (ఎస్పీ) నాయకురాలు సుప్రియా సూలే ఇతర కూటమి నేతలు ఆదివారం ముంబైలో ఈ మ్యానిఫెస్టో విడుదల చేశారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.3,000 ఆర్థిక సహాయం, ఒక్కో పేద కుటుంబానికి ఏడాదికి రూ. 3 లక్షల ఆర్థిక ప్యాకేజీ, మహిళా సాధికారత, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 ధరకు ఆరు గ్యాస్ సిలిండర్లు, మహిళల భద్రతకు పటిష్టమైన చట్టాలు, 9-16 ఏళ్లలోపు బాలికలకు ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, మహిళలకు ప్రతి నెలా రెండు రోజుల పీరియడ్ లీవ్ వంటి హామీలు ఇచ్చారు.
కాగా, మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలను నివారించేందుకు, ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు మెరుగైన పథకం కోసం ఒక ఉన్నత స్థాయి కమిటీ, సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు రూ. 50,000 ఆర్థిక ప్రోత్సాహకం, రైతులు పండించిన పంటలకు సరైన ధర, కేవలం ఫసల్ బీమా పథకం అమలు, నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 పెన్షన్, విద్యార్థులకు స్కాలర్షిప్ పథకాలు, రాష్ట్ర ఆరోగ్య బీమా పాలసీ విస్తరన, సామాజిక న్యాయం కింద కుల గణన, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగింపు వంటి హామీలను ఈ మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. ఎంవీఏ ప్రభుత్వం ఏర్పడితే వంద రోజుల్లో ఈ హామీలను నెరవేర్చుతామని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరుగనున్నది. నవంబర్ 23న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.