మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసులో నవాబ్ మాలిక్‌ను ఈడీ ఉదయం నుంచి ప్రశ్నిస్తోంది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్ మాలిక్ మరణ వాంగ్మూలాన్ని కూడా ఈడీ నమోదు చేసింది. విచారణ నిమిత్తమై ఈడీ అధికారులు ఈ రోజు ఉదయం 7 గంటలకే నవాబ్ మాలిక్ నివాసానికి చేరుకున్నారు. దీంతో ఉదయం నుంచే మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.
స్పందించిన మంత్రి
ఈడీ అరెస్ట్‌పై మంత్రి నవాబ్ మాలిక్ స్పందించారు. తానేమీ భయపడనని స్పష్టం చేశారు. పోరాడుతూనే వుంటానని, గెలుపు తథ్యమని నవాబ్ మాలిక్ ధీమా వ్యక్తం చేశారు.
ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు
మంత్రి నవాబ్ మాలిక్‌ను ఈడీ ప్రశ్నించడంపై మహారాష్ట్ర నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ… నవాబ్ మాలిక్ కేబినెట్ మంత్రి అని, ఓ సీనియర్ నేత అని, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఈడీ ప్రశ్నించడం ఏంటని విరుచుకుపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, 2024 తర్వాత బీజేపీ నేతలకూ ఇదే గతి పడుతుందని రౌత్ హెచ్చరించారు.
ఇక ఎన్సీపీ నేత సుప్రియా సూలే కూడా స్పందించారు. ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే ఈడీ ప్రశ్నించడం తప్పని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. నవాబ్ మాలిక్‌కు ఈడీ నోటీసులు వస్తాయని బీజేపీ కొన్ని రోజుల నుంచే ట్వీట్లు చేస్తోందని, ఇది మహారాష్ట్రకే అవమానమని సుప్రియా సూలే అన్నారు.