న్యూఢిల్లీ, మే 11: సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని పునరుద్ధరించిందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. షిండే వర్గం ఎమ్మెల్యేలు పార్టీని, తన తండ్రి వారసత్వాన్ని వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌కు విలువలు ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి పదవికి తన రాజీనామా న్యాయపరంగా తప్పు కావచ్చని, ఒకవేళ తాను ఆనాడు రాజీనామా చేయకుండా ఉండి ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రిని అయ్యేవాడినని పేర్కొన్నారు. కానీ, తాను నైతిక విలువల ఆధారంగా రాజీనామా చేశానన్నారు. ఇప్పుడు షిండే కూడా ఇదే పని చేయాలన్నారు. షిండే వర్గానికి చెందిన భరత్ గొగవాలేను విప్‌గా నియమించడాన్ని కోర్టు తప్పుపట్టినందున, 16 మంది ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేటప్పుడు శివసేన విప్‌గా తాము నియమించిన సునీల్ ప్రభునే స్పీకర్ పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అసలు శివసేనకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో నిర్ధారించే ప్రక్రియను సహేతుకమైన సమయంలో పూర్తి చేస్తానని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీని గుర్తించాల్సింది స్పీకరేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన భరత్ గొగవాలేను విప్‌గా నియమించడం చట్టవ్యతిరేకమన్న కోర్టు నిర్ణయాన్ని తాను అంగీకరిస్తున్నట్టు తెలిపారు.