Maharashtra | ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌కు అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నప్పటికీ అధికారిక ప్రకటనకు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నది. మరాఠాల్లో వ్యతిరేకత వస్తుందనే ఆందోళననే ఇందుకు కారణమని తెలుస్తున్నది. మరాఠా అయిన ఏక్నాథ్ షిండేను సీఎం పదవి నుంచి తప్పించి బ్రాహ్మణుడైన ఫడ్నవీస్‌కు అవకాశం ఇవ్వడం వల్ల మరాఠాల్లో అసంతృప్తి నెలకొంటుందేమో అని బీజేపీ భావిస్తున్నది. ఫడ్నవీస్‌ను ‘మరాఠా వ్యతిరేకి’గా పలుమార్లు మరాఠా నాయకుడు మనోజ్ జరాంగే అభివర్ణించడం, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల్లో మెజారిటీ సభ్యులు మరాఠాలే కావడం కూడా ఇందుకు కారణాలని తెలుస్తున్నది. మరోవైపు సీఎం ఎంపికకు సంబంధించి చర్చించేందుకు షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ఢిల్లీలో గురువారం రాత్రి సమావేశం అయ్యారు.
సీఎం పదవితో పాటు సగం మంత్రి పదవులను బీజేపీ తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మిగతా సగం పదవులను శివసేన, ఎన్సీపీకి కేటాయించనున్నది. షిండే నేతృత్వంలోని శివసేనకు 12 మంత్రి పదవులు దక్కనున్నట్టు తెలుస్తున్నది.
మహా వికాస్ అఘాడీ ఓటమికి కాంగ్రెస్ పార్టీ అతి విశ్వాసం, వైఖరే కారణమని శివసేన(యూబీటీ) అంతర్మథనం చెందుతున్నది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ 103 స్థానాల్లో పోటీ చేసి కేవలం 16 స్థానాల్లో గెలిచింది. శివసేన(యూబీటీ) 89 స్థానాల్లోనే పోటీ చేసినా 20 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ తక్కువ స్థానాలను తీసుకొని ఉంటే ఫలితాలు అనుకూలంగా ఉండేవని శివసేన నేతలు అంటున్నారు. ‘లోక్‌సభ ఫలితాల తర్వాత కాంగ్రెస్ అతివిశ్వాసంతో ఉంది. సీట్ల పంపకాల్లో ఆ పార్టీ వైఖరి మాకు నష్టం చేసింది. సీఎం అభ్యర్థిగా ఉద్ధవ్‌ను ప్రకటించి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవి’ అని శివసేన(యూబీటీ) నేత అంబదాస్ దన్వే పేర్కొన్నారు.