ముంబై, జనవరి 3 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని 29 నగర పాలక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఏకగ్రీవం కావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ సంస్థలకు ఈ నెల 15న పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. అనేక మంది ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి అభ్యర్థులు అనేక మంది (సుమారు 70 శాతం మంది) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
దీనిపై ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ,శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ ఇది ఓటర్ల హక్కులను హరించడమేనని మండిపడ్డారు. ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలతో విపక్షాల అభ్యర్థులను బెదిరించడం, లంచాలు ఇవ్వడం వల్లే ఇన్ని స్థానాలు ఏకగ్రీవం కావడం సాధ్యమైందని విపక్షాలు ఆరోపించాయి. కాగా, దీనిపై దర్యాప్తునకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అప్పటివరకు విజేతలను ప్రకటించవద్దని అధికారులను ఆదేశించింది.