ముంబై : బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికి ఓట్లు వేయబోమని ప్రతిజ్ఞ చేయాలని మహారాష్ట్ర ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం ఆమోదించిన ఛార్జీలను ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి రెయిడ్ హెయిలింగ్ ప్లాట్‌ఫామ్స్ తమ యాప్‌లలో అమలు చేయడం లేదని తెలిపారు. తాము ఈ విషయాన్ని అనేకసార్లు లిఖితపూర్వకంగా, మౌఖికంగా రాష్ట్ర సహాయ రవాణా కమిషనర్‌కు తెలియజేసినప్పటికీ ఫలితం లేకపోతున్నదని చెప్పారు. ఈ కంపెనీలు ప్రభుత్వ ఆదేశాలను నిర్లక్ష్యం చేయడాన్ని కొనసాగిస్తున్నాయన్నారు.
ఈ నెల 30నాటికి న్యాయమైన ఛార్జీలను అమలు చేయాలని, బైక్ ట్యాక్సీలను నిషేధించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే, తాము రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 30న 11 గంటలకు ప్రతిజ్ఞ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఆమోదించిన ఛార్జీలను అమలు చేస్తామని రెయిడ్ హెయిలింగ్ ప్లాట్‌ఫామ్స్ ఈ నెల 16న మరోసారి హామీ ఇచ్చాయని, ఆ హామీని అమలు చేయకుండా ఈ కంపెనీలు తమ సిబ్బందిని, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాయని డ్రైవర్లు ఆరోపించారు.