న్యూఢిల్లీ, మార్చి 27: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా సందర్భంగా తొక్కిసలాట జరిగి 30 మందికి పైగా భక్తులు మరణించి రెండు నెలలు దాటిపోయినప్పటికీ బాధిత కుటుంబాలకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించిన రూ. 25 లక్షల పరిహారం ఇప్పటివరకు అందలేదు. బీజేపీ ప్రభుత్వం నుంచి హామీలు వచ్చినప్పటికీ మృతుల జాబితా వెల్లడి కాకపోవడం, నష్ట పరిహారం పరిస్థితిపై ప్రకటన ఏదీ వెలువడకపోవడంతో మృతుల కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జనవరి 29న త్రివేణీ సంగమం వద్ద తొక్కిసలాట జరుగగా మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటనేదీ ఇప్పటి వరకు యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కాని, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కాని వెల్లడించకపోవడం గమనార్హం.
గడచిన రెండు నెలలుగా ఎక్కని మెట్టు, దిగని మెట్టు లేదన్న చందంగా బాధిత కుటుంబాలు అన్ని శాఖల అధికారులను కలుసుకుని తమ గోడు వెళ్లబోసుకుంటున్నా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. అయితే తొక్కిసలాటలో మరణించినవారి మరణ ధ్రువీకరణ పత్రాన్ని(డెత్ సర్టిఫికెట్) సైతం అధికారులు తమకు అందచేయకపోవడం బాధిత కుటుంబాలను ఎక్కువగా వేదనకు గురిచేస్తోంది. నష్టపరిహారం కాని ధ్రువీకరణ పత్రాలు కాని తమకు ఏవీ అందలేదని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. త్వరలోనే మృతుల జాబితాను బహిర్గతం చేస్తామని రాష్ట్ర పోలీసులు హామీ ఇచ్చినప్పటికీ అది ఇంకా అమలుకాలేదు. తొక్కిసలాటలో 79 మంది వరకు మరణించారని కొన్ని పత్రికలు వెల్లడించగా 1,000 మంది వరకు మరణించారని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అప్పట్లో ప్రకటించారు.
మానసిక వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు ఆశ్రయమిస్తున్న యూపీ ప్రభుత్వ పునరావాస కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం భోజనం చేశాక 20కిపైగా పిల్లలు అస్వస్థతకు గురికాగా వీరిలో నలుగురు మరణించారు. మరో 16 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారు. లక్నోలోని పురా ప్రాంతంలో ఉన్న పునరావాస కేంద్రానికి చెందిన పిల్లలు అస్వస్థతకు గురయ్యారని, విషాహారం తినడం వల్ల ఇది జరిగి ఉండవచ్చని లక్నో జిల్లా మెజిస్ట్రేట్ విశాక్ జీ తెలిపారు. మరణించిన నలుగురు పిల్లల వయసు 12 నుంచి 17 ఏళ్ల మధ్య ఉంటుందని చెప్పారు.