Maharashtra | ముంబై, నవంబర్ 30(నమస్తే తెలంగాణ), ముంబై : మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి పదవుల పంపకంలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నది. ఉప ముఖ్యమంత్రికే హోం శాఖను ఇవ్వాలని శివసేన పట్టుబడుతున్నది. తమ నేత షిండేను పక్కనబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడుతున్నది. ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ మాత్రం బీజేపీకే ముఖ్యమంత్రి పదవి అని, ఎన్సీపీ, శివసేనలకు ఉప ముఖ్యమంత్రి పదవులు అని స్పష్టం చేశారు. అదే సమయంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైందని బీజేపీ ప్రకటించింది. మరోవైపు మహాయుతి కూటమి విచ్ఛిన్నం దిశగా అడుగులు వేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తానికి మహాయుతి రాజకీయాలు అంతు చిక్కుకుండా ఉన్నాయి.
శివసేన(షిండే వర్గం) నేత సంజయ్ శిర్సట్ శనివారం మాట్లాడుతూ..ఉప ముఖ్యమంత్రికే హోం మంత్రి పదవిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రే హోం మంత్రి పదవిని నిర్వహించడం సరికాదన్నారు. సంక్షేమ పథకాలు చాలా కాలం నుంచి అమల్లో ఉన్నప్పటికీ, వాటికి షిండే కొత్త ఊపును తెచ్చారని, అందుకే ఎన్నికల్లో కూటమి పక్షాలకు సత్ఫలితాలు లభించాయని చెప్పారు. మరో రెండున్నరేండ్లు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే, మరింత ఎక్కువ కృషి చేసి ఉండేవారన్నారు. అటువంటి షిండేను పక్కన బెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మరాఠా కోటా ఉద్యమకారులకు నచ్చ చెప్పే బాధ్యతను షిండే తన భుజస్కంధాలపై వేసుకున్నారని చెప్పారు. ఆయన మరాఠా రిజర్వేషన్ కూడా ఇచ్చారని, అందుకే ఆయనకు మద్దతు పెరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి మాఝీ లడ్కి బహిన్ పథకం ప్రభావం ఎన్నికల్లో మహాయుతిపై స్పష్టంగా కనిపించిందన్నారు.
సంజయ్ శుక్రవారం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పేరును బీజేపీ అధిష్ఠానం శుక్రవారం అర్ధరాత్రికి ప్రకటిస్తుందనే సమాచారం ఉందన్నారు. ఆ తర్వాతి 24 గంటల్లో ఏక్నాథ్ షిండే చాలా పెద్ద నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మరోవైపు మహాయుతి 2.0 ప్రభుత్వం గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తుందని మహారాష్ట్ర బీజేపీ శాఖ చీఫ్ చంద్రశేఖర్ శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్‌కు కొంత వరకు తెరదించారు. ఆయన శనివారం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పదవి బీజేపీకేనని స్పష్టం చేశారు. మహాయుతిలోని శివసేన, ఎన్సీపీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు వస్తాయని చెప్పారు.
బీజేపీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో దేవేంద్ర ఫడ్నవీస్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రిగా, గత ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు.
మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, శివసేన(షిండే వర్గం) చీఫ్ ఏక్నాథ్ షిండే అస్వస్థతతో బాధ పడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సతారా సివిల్ సర్జన్ యువరాజ్ కార్పే మాట్లాడుతూ, షిండే శ్వాసనాళం ఇన్ఫెక్షన్తో బాధ పడుతున్నారని తెలిపారు. ఆయనకు నీరసం, జ్వరం, గొంతులో దురద ఉన్నట్లు చెప్పారు. పల్స్ రేటు, బీపీ సాధారణంగా ఉన్నాయన్నారు. నీరసంగా ఉన్నందువల్ల రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు.
మహాయుతి కూటమి విచ్ఛిన్నం దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యమంత్రి పదవిని దేవేంద్ర ఫడ్నవీస్‌కు కట్టబెట్టడాన్ని ఏక్నాథ్ షిండే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, సీఎం పదవిని ఇవ్వకపోయినా, శాంతి భద్రతలతో సహా హోం శాఖను పూర్తిగా తమకే ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారని చెప్తున్నారు. దీనికి బీజేపీ పెద్దలు ససేమిరా అనడంతో ఆయన అలిగి, అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని, సొంతూరుకు వెళ్లిపోయారని అంటున్నారు. మహాయుతితో తెగదెంపులు చేసుకోవాలని శివసేన నేతలు ఆయనకు సలహా ఇస్తున్నట్లు మీడియా కథనాలను బట్టి తెలుస్తున్నది.