న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: భారీ సంఖ్యలో భక్తులు మహా కుంభమేళాను సందర్శిస్తుండటంతో రవాణా సదుపాయాల కొరత, ఆకాశాన్నంటే ధరలు భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. చాలామంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. అరకొర ఏర్పాట్లు చేసిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మహా కుంభ్‌పై అంచనాలను పెంచివేసిందని, దీంతో అక్కడకు వెళ్లిన భక్తులను పెంచిన ధరలు, సౌకర్యాల లేమి వెంటాడుతున్నాయంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించిన నేపథ్యంలో మహా కుంభ్‌ను సందర్శించిన కొందరు భక్తులు తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.
సంగం వద్దకు వెళ్లేందుకు ప్రైవేట్ ఆటోలు, ఇతరవాహనాలు వందల్లో చార్జీలు వసూలు చేస్తున్నారని దినేశ్ రాణా అనే భక్తుడు వాపోయాడు. సాధారణ హోటల్ ధరలు సైతం ఫైవ్ స్టార్ రేట్లను మరపిస్తున్నాయి. ఒక్కో గదికి గంటకు రూ. 5,000 చొప్పున వసూలు చేస్తున్నారు. సంగం వద్దకు వెళ్లడానికి పడవలో ఒక్కో మనిషికి రూ. 150 చొప్పున తీసుకోవలసి ఉండగా ప్రస్తుతం రూ. 1,000 నుంచి రూ. 1,500 వరకు పడవ నిర్వాహకులు దండుకుంటున్నారు.