భోపాల్: బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. పోలింగ్ రోజున యూ టర్న్ తీసుకున్నారు. నగరాన్ని అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ వీడియో సందేశాన్ని సోషల్ మీడియలో పోస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా మేయర్ విక్రమ్ (mayor Vikram Ahake) ఏప్రిల్ 1న సీఎం మోహన్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణు దత్ శర్మ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
కాగా, తొలిదశ పోలింగ్ రోజైన శుక్రవారం మేయర్ విక్రమ్ అనూహ్యంగా యూ టర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి, కమల్‌నాథ్ కుమారుడు నకుల్ నాథ్‌కు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఒక రాజకీయ పార్టీలో చేరిన వెంటనే, నాకు ఊపిరాడటం లేదు. చింద్వారాను అభివృద్ధి చేసిన వ్యక్తితో పని చేయడం లేదని నేను భావించా. విద్యా రంగమైనా, ప్రజలకు వైద్యం అందించాలన్నా, అభివృద్ధి పనులు చేపట్టాలన్నా నియోజకవర్గ అభివృద్ధికి నకుల్‌నాథ్ ఎప్పుడూ అంకితభావంతో ఉన్నారు’ అని అందులో పేర్కొన్నారు.
మరోవైపు భవిష్యత్తులో తనకు చాలా రాజకీయ అవకాశాలు వస్తాయని చింద్వారా మేయర్ విక్రమ్ తెలిపారు. అయితే తన నాయకులైన కమల్ నాథ్, నకుల్ నాథ్‌లతో తాను ఇవాళ నిలబడకపోతే ఏం జరుగుతుందో తనకు తెలియదని అన్నారు. తనకు ఎంతో చేసిన నకుల్ నాథ్, ఆయన తండ్రి కమల్ నాథ్‌ను భారీ మార్జిన్‌తో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నానని ఆ వీడియోలో అన్నారు. కాగా, కాంగ్రెస్ అభ్యర్థి నకుల్ నాథ్‌పై పోటీగా వివేక్ బంటీ సాహును బీజేపీ రంగంలోకి దించింది.