Madhya Pradesh : గర్భిణి అయిన భార్యను హత్య చేసిన భర్తకు ఊరటనిచ్చేలా మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. అతడికి విధించిన జీవిత ఖైదు శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. భార్య రెచ్చగొట్టడం వల్లే, భర్త అనుకోకుండా ఈ దాడి చేశాడని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ తీర్పు ఇటీవల వెలువడింది. జస్టిస్ వివేక్ అగర్వాల్, జస్టిస్ అవనింద్ర కుమార్ సింగ్ ఆధ్వర్యంలోని మధ్యప్రదేశ్ హైకోర్టు బెంచ్ ఈ తీర్పు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలివి.
చింద్వారా పరిధిలోని చౌరాయి బ్లాక్‌లో ఉండే శివ కహార్ అనే వ్యక్తి 2021, సెప్టెంబర్ 18న తన భార్య కిరణ్‌ను హత్య చేశాడు. ఈ సమయంలో ఆమె ఏడు నెలల గర్భిణి. హత్య జరిగే రోజున భార్యాభర్తలు శివ, కిరణ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. భర్త ఏ పని చేయకుండా ఉన్నాడని భార్య నిందించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా జరిగిన వాగ్వాదంలో భార్య.. ‘నాకు నీలాంటి భర్తలు వేలమంది ఉంటారు’ అంటూ వ్యాఖ్యానించింది. దీంతో ఆవేశానికి లోనైన శివ కహార్.. కిరణ్‌పై రాయితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన భార్య కిరణ్ అక్కడికక్కడే మరణించింది. ఆమె హత్య అనంతరం శివ.. కిరణ్ తల్లిదండ్రులకు, పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో పోలీసులు నిందితుడు శివను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై చింద్వారా జిల్లా కోర్టులో విచారణ జరిగింది. నిందితుడి నేరాన్ని గుర్తించిన కోర్టు.. అతడికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ నిందితుడు శివ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు.
దీనిపై విచారించిన కోర్టు శివకు విధించిన జీవిత ఖైదును ఏడేళ్ల కారాగార శిక్షకు తగ్గిస్తూ తాజాగా తీర్పునిచ్చింది. ఈ సందర్బంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడు ఉద్దేశపూర్వకంగా, ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆమెను హత్య చేయలేదని తెలిపింది. భార్య రెచ్చగొట్టే మాటలవల్లే ఆవేశంలో హత్యకు పాల్పడ్డాడని, అందువల్ల అతడికి జీవిత ఖైదు విధించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. దీంతో అతడి శిక్షను తగ్గిస్తున్నట్లు కోర్టు పేర్కొంది.