సెహోర్: గత శనివారం బీజేపీ పాలిత గుజరాత్లో రెండేండ్ల చిన్నారి బోరు బావిలో పడి మరణించిన సంగతి మరువక ముందే అదే పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లోనూ ఆ తరహా ఘటన జరిగింది. రెండేన్నరేండ్ల శ్రిష్టి అనే బాలిక మంగళవారం మధ్యాహ్నం ముంగవలి గ్రామంలోని బోరు బావిలో పడింది. సహాయక చర్యల్లో ఉపయోగించిన యంత్రం ప్రకంపనల కారణంగా 40 అడుగుల లోతులో ఉన్న బాలిక మరో 100 అడుగుల లోతుకు, ఆ తర్వాత 135 అడుగుల లోతుకు జారిపోయింది.
52 గంటల రెస్క్యూ ఆపరేషన్ అనంతరం గురువారం చిన్నారిని బయటకు తీసి దవాఖానకు తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందిందని, శరీరం కుళ్లి పోవడం ప్రారంభించిందని వైద్యులు వెల్లడించారు. నిరుపయోగంగా ఉన్న బోరు బావుల చుట్టూ కంచె వేయాలని 2010లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసినా వాటి అమలుపై చాలా రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపకపోవడంతో తరచూ చిన్నారులు బోరు బావుల్లో పడి చనిపోతున్నారు.