ఖాండ్వా (మధ్యప్రదేశ్), ఆగస్టు 13: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో న్యాయం కోసం నడిరోడ్డుపై ఒక రైతు పొర్లు దండాలు పెడుతూ కలెక్టర్ కార్యాలయానికి రావడం సంచలనం సృష్టించింది. ఖాండ్వాకు చెందిన శ్యామ్లాల్ అనే రైతు తన భూమిని కొందరు కబ్జా చేశారంటూ రెండేండ్ల క్రితం అధికారులకు ఫిర్యాదు చేసినా దానిని ఎవరూ పట్టించుకోలేదు.
కలెక్టర్ కార్యాలయంలో జరిపే బహిరంగ విచారణలో ఆయన కేసు కూడా పరిశీలనకు పెట్టారు. దీనికి మామూలుగా నడిచో, వాహనంపైనో రాకుండా తన నిరసనను వ్యక్తం చేయడానికి శ్యామ్లాల్ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు. రెండు చేతులూ జోడించి బట్టలన్నీ మాసిపోయినా, వంటికి గాయాలైనా లెక్కచేయకుండా రోడ్డుపై పొర్లుదండాలు పెడుతూ కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని శ్యామ్లాల్కు హామీ ఇచ్చారు.