న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో దగ్గు మందు తాగిన చిన్నారులు మరణించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ మాన్యుఫ్యాక్చరర్లకు గట్టి హెచ్చరిక పంపింది. ఔషధాల తయారీ కంపెనీలన్నీ తప్పనిసరిగా అంతర్జాతీయ ఉత్తమ తయారీ పద్ధతులను పాటించాలని, లేదంటూ మూసివేత తప్పదని కేంద్ర ఔషధాల ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) ఆదేశించింది. గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ (జీఎంపీ)ని వచ్చే జనవరి 1 నాటికి పాటించాలని స్పష్టం చేసింది.
ఈ గడువును పొడిగించేది లేదని తెలిపింది. సంవత్సరానికి రూ.250 కోట్లు కన్నా తక్కువ టర్నోవరు కలిగిన 1,470 కంపెనీలకు ఈ ఆదేశాలిచ్చింది. సవరించిన ప్రమాణాలను పాటించడానికి ఇచ్చిన మినహాయింపు పొడిగింపు కోసం 2025 మే నెలకు ముందు దరఖాస్తు చేసిన ఈ చిన్న కంపెనీలకు గతంలో 2026 జనవరి 1 వరకు గడువు ఇచ్చారు.