షిమ్లా: బాలీవుడ్ స్టార్ నటి, మండి లోక్సభ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) కరెంటు బిల్లుల వివాదంలో చిక్కుకున్నారు. మనాలిలోని తన నివాసానికి రూ.లక్ష కరెంటు బిల్లు వచ్చిందని, ఈ మధ్య కాలంలో తాను అసలు ఆ ఇంట్లోనే ఉండటం లేదంటూ ఆమె చేసిన ప్రకటనతో ఒక్కసారిగా వివాదం రాజుకున్నది. అధికార కాంగ్రెస్ మంత్రులు ఆమెపై విరుచుకుపడుతున్నారు. మూడు నెలలుగా బిల్లులు కట్టడం లేదంటూ విద్యుత్ అధికారులు ఆమెకు నోటీసులు కూడా పంపించారు. తాజాగా మంత్రి విక్రమాదిత్య సింగ్ (Vikramaditya Singh) ఈ వ్యవహారంపై స్పందించారు. మేడమ్ కరెంట్ బిల్లులు చెల్లించరు. అంతటితో ఆగకుండా ప్రభుత్వాన్నే నిందిస్తారు. ప్రజావేదికలపై గోల చేస్తారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తారు. ఇప్పటికైనా కళ్లు పెద్దవి చేసి బిల్లును చూడండి అంటూ చురకలు అంటించారు. గతంలో రూ.5 వేలు బిల్లు వచ్చేదని, ఇప్పుడు మాత్రం రూ.80 వేలు వస్తున్నదని చెప్పారని, ఆమె తన ఇంట్లో ఏదైనా ఫ్యాక్టరీ నడుపుతున్నారా అని ప్రశ్నించారు.
కాగా, కంగనా కరెంటు బిల్లుల వ్యవహారంపై హిమాచల్ ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (హెచ్పీఎస్ఈబీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ బుదవారం స్పష్టతనిచ్చారు. కంగనాకు ఈ నెల రూ.55 వేల బిల్లు మాత్రమే వచ్చిందని చెప్పారు. కానీ, ఆమె గతంలో చెల్లించని బిల్లులు కూడా కలిపి రూ.91,100గా పూర్తి బిల్లు వచ్చిందని తెలిపారు. జనవరి, ఫిబ్రవరి బిల్లులు చెల్లించలేదని, అప్పటికే రూ.32,287 బిల్లు చెల్లించాల్సి ఉందన్నారు. సకాలంలో బిల్లులు చెల్లిస్తే ఇంత మొత్తంలో వచ్చేది కాదని పేర్కొన్నారు. అంతేకాకుండా 28 రోజుల్లోనే దాదాపు 9 వేల యూనిట్ల విద్యుత్ వినియోగించారని, అందుకే ఒక్క నెల బిల్లు కూడా రూ.55 వేలు వచ్చిందని లెక్కలతో సహా చూపించారు. ఇదే సమయంలో ఆమెకు రూ.700 సబ్సిడీ కూడా ఇచ్చినట్లు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే..
బుధవారం మండి నియోజవర్గంలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ఎంపీ కంగనా రనౌత్ మాట్లాడుతూ.. మనాలిలోని తన నివాసానికి రూ.లక్ష కరెంటు బిల్లు వచ్చింది. ఈ మధ్య కాలంలో తాను అసలు ఆ ఇంట్లోనే ఉండటం లేదని చెప్పారు. అలాంటప్పుడు అంత బిల్లు ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఆ బిల్లు చూసి తాను షాక్కు గురైనట్లు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్లో ఇలాంటి పరిస్థితులు సిగ్గు చేటు అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉన్న సోదరీ సోదరులను తాను ఒకటి కోరుతున్నానని, అందరం కలిసి సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దేశం, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తోడేళ్ల చెర నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం అంటూ నినదించారు.