Bus Catches Fire | ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నో కిసాన్పాత్లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిహార్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దరాయప్తు చేస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మంటలు రావడానికి కారణం ఏంటో ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 80 మంది ప్రయాణికులు బస్సులో ఉన్న సమాచారం. ఘటనలో ఐదుగురు సజీవ దహనం కాగా.. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వేకువ జామున 5గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఆ సమయంలో ప్రయాణికులు అందరూ బస్సులో గాఢ నిద్రలో ఉన్నారు. బస్సులో మంటలు వచ్చిన తర్వాత డ్రైవర్, కండక్టర్ అద్దాలు పగులగొట్టి తప్పించుకున్నారు. మంటలతో బస్సు డోర్లు లాక్ అయ్యాయి. ఆ తర్వాత ఇద్దరూ మరికొందరిని రక్షించారు. ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అరగంటలోపు మంటలను అదుపు చేశారు. బస్సు ఎమర్జెన్సీ గేటు తెరవకపోవడంతో వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తులు బస్సులోనే చిక్కుకుపోయారని పోలీసు దర్యాప్తులో తేలింది. మంటలు చాలా తీవ్రంగా ఉండడంతో కిలో మీటర్ వరకు మంటలు కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మంటలు వ్యాపించినా కొంత దూరం వరకు బస్సు ప్రయాణిస్తూనే ఉందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.