West Bengal : పశ్చిమ బెంగాల్లో ఓ ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఏకంగా 500 మంది మహిళల్ని మోసం చేశాడు. వారి వద్ద నుంచి దాదాపు రూ.2 కోట్లకుపైగా మోసానికి పాల్పడ్డాడు. పశ్చిమ బెంగాల్, నార్త్ 24 పరగణాస్ ప్రాంతానికి చెందిన ఆనంద్ కుమార్ (35) పలు మోసాలకు పాల్పడ్డాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సౌత్-వెస్ట్ జిల్లా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడు హనీ ట్రాపింగ్, రొమాన్స్ స్కామ్స్, ఆన్లైన్ బ్లాక్మెయిల్, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ సహా అనేక నేరాలకు పాల్పడ్డాడు.
డేటింగ్ యాప్స్, సోషల్ మీడియా, మ్యాట్రిమోనియల్ సైట్లలో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకునేవాడు. డాక్టర్, లాయర్, సినీ నిర్మాత, వ్యాపారవేత్త, ఇలా అనేక వృత్తులు చేస్తున్నట్లు మహిళల్ని నమ్మించేవాడు. అవి నమ్మి దగ్గరైన మహిళల నుంచి రకరకాలుగా డబ్బులు కొట్టేసేవాడు. కొంతమందిని పెళ్లి చేసుకుని డబ్బు తీసుకుని మోసం చేయడం, ఇంకొందరికి మెడికల్ ఎమర్జెన్సీ ఉందని నమ్మించి మోసం చేయడం, వ్యాపారంలో నష్టపోయానని, ఇతర కారణాలను సాకుగా చూపి డబ్బులు తీసుకునేవాడు. ఇలా దాదాపు 500 మంది మహిళల్ని టార్గెట్ చేసి వారి వద్ద నుంచి రూ.2 కోట్ల వరకు వసూలు చేశాడు. అంతేకాదు, తనను నమ్మి దగ్గరైన మహిళల ఫొటోలు, వీడియోలు కూడా తీసి వారిని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఆ ఫొటోలు, వీడియోల్ని సోషల్ మీడియాలో, ఇతర సైట్లలో పెడతానని బెదిరించేవాడు. ఇటీవల అతడిపై ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ తతంగం అంతా బయటపడింది. గతంలో కూడా అతడిపై పలు కేసులు నమోదయ్యాయి.
తాజాగా ఒక మహిళ తనను వైభవ్ అరోరా పేరుతో ఆనంద్ మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా తనను సంప్రదించడాని తెలిపింది. ఈ అకౌంట్స్ ఆధారంగా ఆరా తీయగా, దీని వెనుక పెద్ద వ్యవహారమే ఉందని పోలీసులు గుర్తించారు. మహిళల్ని మోసం చేసేందుకు అతడు వివిధ మొబైల్స్ వాడేవాడు. అతడి దగ్గరి నుంచి పోలీసులు నాలుగు సెల్ఫోన్లు, సిమ్ కార్డులు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణ జరుగుతోంది.