West Bengal : దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నేటితో ముగిశాయి. మే 4న ఫలితాలు వెల్లడవుతాయి. అన్నింటికంటే ఈ ఎన్నికల్లో ఎక్కువ ఆసక్తి కలిగించిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. సర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు బెంగాల్‌కు సంబంధించిన ప్రతి అంశం ఆసక్తికరంగా నిలిచింది. అయితే, పలు సంస్థల సర్వే ప్రకారం ఈ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ అధికారం చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అంటే మమత నాలుగోసారి విజయం సాధించే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
వరుసగా మూడు సార్లు విజయం సాధించిన మమతకు ఈ సారి ఎదురుదెబ్బ తప్పకపోవచ్చని అంచనా. పశ్చిమ బెంగాల్లో 294 సీట్లున్నాయి. అధికారం చేపట్టాలంటే 148 సీట్లు కావాలి. వివిధ సర్వేల వివరాలివి. మ్యాట్రిజ్ సర్వే ప్రకారం టీఎంసీకి 125–140 సీట్లు, బీజేపీకి 146–161 సీట్లు, ఇతరులకు 6–10 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. చాణక్య సంస్థ ప్రకారం బీజేపీకి150–160 సీట్లు, టీఎంసీకి 130–140 సీట్లు, ఇతరులకు 6–10 సీట్లు, ప్రజా పోల్ సంస్థ ప్రకారం టీఎంసీకి 85–110 సీట్లు, బీజేపీకి 178–208 సీట్లు, ఇతరులకు 0–5 సీట్లు, పోల్ డైరీ సంస్థ ప్రకారం టీఎంసీకి 99–127 సీట్లు, బీజేపీకి 142–171 సీట్లు, ఇతరులకు 5–9 సీట్లు, పీ మార్క్ సంస్థ ప్రకారం టీఎంసీకి 118–138 సీట్లు, బీజేపీకి 146–161 సీట్లు, ఇతరులకు 6–10 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
ఈ సారి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వరుసగా బెంగాల్లో పర్యటిస్తూ బీజేపీకి ప్రచారం నిర్వహించారు. కేంద్ర బలగాల్ని మోహరించి, అల్లర్లు, హింసను తగ్గించగలిగారు. అలాగే, సర్ ద్వారా దొంగ ఓట్లను నియంత్రించగలిగారు. బీజేపీ చేపట్టిన ఈ చర్యలు ఎలాంటి ఫలితాన్నిచ్చాయో మే 4న తేలనుంది.