భోపాల్ : మధ్యప్రదేశ్లోని ప్రముఖ పశుపతినాథ్ ఆలయం నీట మునిగింది. భారీ వర్షాల నేపథ్యంలో పోటెత్తిన వరదలకు ఆలయంలోకి నీరు చేరింది. మందసౌర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శివనా నది ఉప్పొంగుతున్నది. దీంతో పశుపతినాథ్లోని గర్భగుడి వరకు నీరు చేరింది. దీంతో అష్టముఖి విగ్రహం కింది భాగంలోని నాలుగు ముఖాలు పూర్తిగా నీటమునిగాయి.
పశుపతినాథుడిని గంగా అభిషేకించడం గతవారం రోజుల్లో రెండోసారి. ఇదిలా ఉండగా.. దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ రాష్ట్రాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. ప్రయాగ్రాజ్లో పలువురి ఇళ్లలోకి నీరు చేరింది. బీహార్ రాజధాని పాట్నాలో ఘాట్లు నీట మునిగాయి.