న్యూఢిల్లీ : శ్రీకృష్ణుడు తొలి మధ్యవర్తి అని సుప్రీంకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. బృందావనంలోని శ్రీ బంకే బీహారీ దేవాలయం కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ దేవాలయం నిధులు రూ.500 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేయడంతో వివాదం ఏర్పడింది. ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది.
ఈ దేవాలయం ట్రస్ట్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు ఓ కమిటీని నియమిస్తామని తెలిపింది. ఆర్డినెన్స్‌ను జారీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆత్రుతగా వ్యవహరించిందని ప్రశ్నించింది. ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతను అలహాబాద్ హైకోర్టు పరీక్షించాలని తెలిపింది. దేవాలయం నిధులను వినియోగించేందుకు సుప్రీంకోర్టు అనుమతిని పొందడంలో ప్రభుత్వం పాటించిన గోప్యత పట్ల అసమ్మతి వ్యక్తం చేసింది.