ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం..? ఎన్డీయే పాలనలో ఆగమైన దేశం! పుష్కరకాలంగా ప్రజల బతుకులు వేదనాభరితం! ఈ వర్గం, ఆ వర్గం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ అలుముకున్న నైరాశ్యం! బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ విధానపరమైన వైఫల్యాలతో కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, వ్యాపారులే కాదు, సామాన్యుల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. పేద, మధ్యతరగతి కుటుంబాలను ధరాఘాతం అతలాకుతలం చేస్తున్నది.
ఓవైపు నగరాల్లో ఉపాధి దొరుకక, ఖర్చులు భరించలేక వలస కార్మికులు స్వస్థలాలకు మళ్లిపోతుంటే.. పంటకు గిట్టుబాటు ధర లేక రైతన్న కుదేలవుతున్నాడు. కంటికిరెప్పలా కాపాడి పండించుకున్న పంటను చేజేతులా పారబోసుకొని గుండెలు బాదుకుంటున్నాడు. ఇంధన సంక్షోభంతో పెట్రోల్, డీజిల్ దొరక్క వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు రూపాయి విలువ రోజురోజుకూ చరిత్రాత్మక కనిష్ఠ స్థాయికి పడిపోతున్నది. ఇదే సమయంలో పసిడి, వెండిపై కేంద్రం దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచడంతో తులం బంగారం ధర రూ. 8,500, కిలో వెండి ధరపై రూ. 20 వేలు పెరిగి నగల వ్యాపారం మరింత కుదేలైంది.
న్యూఢిల్లీ, మే 13/(స్పెషల్ టాస్క్ బ్యూరో): బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనలో దేశంలో ఏ ఒక్కవర్గమూ సంతోషంగా లేదు. ప్రభుత్వ విధాన పరమైన వైఫల్యాలతో కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్యులు ఇలా ప్రతిఒక్కరూ తీవ్ర నైరాశ్యంలోకి కూరుకుపోయారు. ధరాఘాతం పేద, మధ్యతరగతి కుటుంబాలను అతలాకుతలం చేస్తున్నది. నగరాల్లో ఖర్చులను భరించలేక వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్తున్న ఘటనలు కొవిడ్ సంక్షోభాన్ని మళ్లీ గుర్తుకుతెస్తున్నాయి. ఇంకోవైపు, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతన్న కుదేలవుతున్నాడు. కన్నబిడ్డలా పండించిన పంటను పారబోసి లబోదిబోమంటున్నాడు. కిలో ఉల్లికి 50 పైసలు ధర పలుకడంతో నిరసనకు దిగిన మహారాష్ట్ర రైతులు తాము పండించిన 2,500 కిలోల పంటను పారబోశారు.
ఇక, ఇంధన సంక్షోభం వాహనదారులను రోడ్డుకీడ్చింది. పెట్రోల్, డీజిల్ దొరక్కపోవడంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. డీజిల్ కోసం 20 బంకులు తిరిగామంటూ నాగపూర్‌లో ట్రక్కు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధన సంక్షోభంతో ఒకవైపు విమానయానం రెక్కలు విరగ్గా.. టూరిజం పడకేసింది. పెరిగిన ఇంధన ధరలను తాళలేక ఎయిరిండియా సంస్థ కీలక నిర్ణయం తీసుకొన్నది. మూడు నెలల పాటు అంతర్జాతీయ సర్వీసులను కుదిస్తున్నట్టు ప్రకటించింది. విదేశీ పర్యటనలు మానుకోవాలన్న ప్రధాని మోదీ పిలుపుతో ఓవర్సీర్ ఎంక్వైరీలు 15 శాతం మేర క్షీణించాయి. ఇక, నిన్నమొన్నటి వరకూ పెట్రో ధరల పెంపు ఉండదంటూ బుకాయించిన కేంద్రప్రభుత్వ పెద్దలు ఇప్పుడు యూటర్న్ తీసుకొన్నారు. పెట్రో ధర పెంపు ఉండొచ్చంటూ కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పురి వెల్లడించారు.
న్యూఢిల్లీ, మే 13: దేశంలో పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదంటూ కేంద్ర ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ, క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. వాహనాల్లో పెట్రోల్, డీజిల్ నింపుకోవడానికి జనం బంకుల వద్ద ఎగబడుతున్న దృశ్యాలు దేశవ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సరకులను రవాణా చేసే ట్రక్కు డ్రైవర్లకు మూతపడిన పంపుల కారణంగా రోజుల తరబడి మండుతున్న ఎండల్లో రోడ్డుపక్కన వాహనాలను నిలిపేసుకుని డీజిల్ కోసం ఎదురుచూసే పరిస్థితి దాపురించింది. డీజిల్ కోసం వెతుకుతూ దాదాపు 80 కిలోమీటర్లు ప్రయాణించాం. 15-16 పంపుల వద్ద ఆగి చూశాం.
ఎక్కడా డీజిల్ లేదు అని నాగపూర్‌లో బొగ్గు లోడ్‌తో ఉన్న ట్రక్కు పక్కన కూర్చున్న సూర్యకాంత్ కేంద్రే అనే డ్రైవర్ అన్నాడు. చివరికి ట్యాంక్ దాదాపు ఖాళీ అవ్వడంతో తాము ఇక్కడ ఆగక తప్పలేదని అతను చెప్పాడు. కాగా, ఓ పెట్రోల్ పంపు మేనేజర్ మాట్లాడుతూ తాను సాధారణంగా డిమాండ్‌లో మూడింట ఒక వంతు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నానని, చాలామంది వినియోగదారుల కండ్ల ముం దే ఇంధనం ఖాళీ అవుతున్నదని అన్నా డు. అయితే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మంగళవారం మాట్లాడుతూ దేశంలో ఇంధన కొరత లేదని ప్రకటించారు. దేశంలో పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదు. దేశంలోని ప్రతి పెట్రోల్ పంపులో పెట్రోల్, డీజిల్ సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి అని ఆయన చెప్పారు.
తన ట్రక్కులకు రిటైలర్లు డీజిల్ అమ్మకాలను పరిమితం చేస్తున్నారని, ఒక్కో ట్రక్కుకు 50 నుంచి 100 లీటర్ల వరకు మాత్రమే ఇంధనాన్ని పోస్తున్నారని అనేక ట్రక్కులను నిర్వహిస్తున్న ఓ ఆపరేటర్ తెలిపారు. ఇది తమ రోజువారీ అవసరాలలో ఒక చిన్న భాగం మాత్రమేనని, దీని ఫలితంగా రద్దీగా ఉండే సరకు రవాణా మార్గాల్లో ప్రయాణానికి సమయం పడుతున్నదని ఆయన అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలతో పోలిస్తే దేశంలోని ప్రైవేట్ గ్యాస్ స్టేషన్ ఆపరేటర్లకు ఎక్కువ వెసులుబాటు ఉంది.
నయారా ఎనర్జీ లిమిటెడ్, షెల్పీఎల్సీ వంటి కొన్ని సంస్థలు ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ సరఫరాను రేషన్ చేసింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి ప్రభుత్వ రంగ రిఫైనరీలు పారిశ్రామిక కొనుగోలుదారులకు డీజిల్ ధరలను లీటరుకు సుమారు రూ.50 వరకు పెంచగలిగాయి. నష్టాల నేపథ్యంలో త్వరలో సామాన్యులకు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే అవకాశం ఉన్నది.
తిరువనంతపురం, మే 13: కేరళలోని ఇంధన కేంద్రాలు బల్క్ ఫ్యూయల్ అమ్మకాలపై ఆంక్షలు విధించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వినియోగదారులను 200 లీటర్ల డీజిల్‌కు పరిమితం చేయడంతోపాటు ఒక్కో వ్యక్తికి పెట్రోల్ కొనుగోళ్లపై సుమారు రూ. 5,000 పరిమితిని విధించినట్లు మీడియా తెలిపింది. రిటైల్ అవుట్లెట్లలో ఇంధనం నిరంతరాయంగా లభించేలా చూడడం, అధిక డిమాండ్ ఉన్న సమయాల్లో స్టాక్ అకస్మాత్తుగా తగ్గిపోకుండా నివారించడం లక్ష్యంగా సరఫరా నిర్వహణ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం పెట్రోల్ పంపులకు ఒకేసారి కొన్ని రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే అందుతున్నాయి.
రుణ ఆధారిత సరఫరా వ్యవస్థలను ఉపసంహరించుకోవడంతోపాటు ముందస్తు చెల్లింపు నిబంధనలను ప్రవేశపెట్టడం వల్ల ఇంధన స్టేషన్లలో పని పరిస్థితులు మరింత కఠినతరం అయినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కేరళలో ప్రస్తుతం అమలు చేస్తున్న విధానానికి ఇంధన కొరత కారణం కాదని అధికారులు స్పష్టం చేసినప్పటికీ ఈ తాత్కాలిక పరిమితులు సాధారణ వినియోగదారుల కంటే బల్క్ వినియోగదారులు, లాజిస్టిక్స్ ఆపరేటర్లపై ఎక్కువ ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. ఈ చర్యల ప్రాథమిక లక్ష్యం పంపిణీని స్థిరీకరించడం, స్థానిక పంపుల వద్ద స్టాక్ అసమతుల్యతను నివారించడమని వర్గాలు తెలిపాయి.