Kiren Rijiju : ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)’ పై లోక్సభ (Lok Sabha) లో చర్చించేందుకు అధికార పక్షం అంగీకరించింది. ఈ విషయాన్ని పార్లమెంట్ (Parliament) వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజుజు (Kiren Rijiju) మీడియాకు వెల్లడించారు. డిసెంబర్ 8న వందేమాతరం (Vandematharam) గీతంపై, డిసెంబర్ 9న ఎన్నికల సంస్కరణల (Electoral reforms) పై లోక్సభలో చర్చ జరుగుతుందని ఆయన తెలిపారు.
ఎన్నికల సంస్కరణలపై చర్చలో భాగంగానే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పై కూడా చర్చించనున్నారు. కాగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజే ‘సర్’పై చర్చించాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ ఆందోళనల మధ్య సభ మంగళవారానికి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఇదే అంశంపై చర్చకు విపక్షం పట్టుబట్టి చివరకు వాకౌట్ చేసింది. చర్చకు తాము విముఖం కాదని, అయితే కాలపరిమితిని నిర్దేశించాలనుకోవడం తగదని అధికారపక్షం పేర్కొంది.
ఇవాళ రెండోరోజు సమావేశాల్లోనూ అదే పరిస్థితి తలెత్తడంతో స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఎట్టకేలకు అధికారపక్షం చర్చకు అంగీకరించింది. అయితే ప్రత్యేకంగా ‘సర్’పై కాకుండా ఎన్నికల సంస్కరణలు అనే విస్తృత అంశాన్ని సభ ముందు ఉంచనుంది.