Lok Sabha Speaker : కేంద్రంలో నరేంద్రమోదీ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాని మోదీ సహా మంత్రుల ప్రమాణస్వీకారం పూర్తయ్యింది. సోమవారం సాయంత్రం జరిగిన క్యాబినెట్ భేటీలో మంత్రులకు శాఖల కేటాయింపు కూడా అయిపోయింది. ఇక మిగిలింది స్పీకర్ ఎంపికనే. గత రెండు పర్యాయాలు బీజేపీకి పూర్తి మెజారిటీ రావడంతో ఆ పార్టీకి చెందిన ఎంపీలే స్పీకర్ పదవులు చేపట్టారు. ఈసారి బీజేపీకి సొంత మెజారిటీ రాకపోవడంతో.. స్పీకర్ పదవి బీజేపీ ఎంపీనే వరిస్తుందా..? లేదంటే మిత్రపక్ష పార్టీలకు దక్కుతుందా..? అనే విషయం చర్చనీయాంశంగా మారింది.
చట్టాలను రూపొందించే పార్లమెంట్ ఉభయసభల్లో లోక్‌సభది కీలకపాత్ర. లోక్‌సభను నడపడం స్పీకర్ విధి. అధికార, విపక్ష సభ్యులతో కూడిన ఈ సభను సజావుగా నడపటం అంత సులువేం కాదు. ఈ పోస్టులో ఉన్నవారు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అవిశ్వాస తీర్మానం, పార్టీ ఫిరాయింపులు, కీలక బిల్లులు గట్టెక్కడం లాంటి విషయాల్లో స్పీకర్‌ది కీలకపాత్ర. అందుకే ఇప్పుడు అందరిదృష్టి స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందనే దానిపైనే ఉంది.
మోదీ నూతన ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ, జేడీయూ కీలకంగా మారాయి. ఈ క్రమంలో ఆ రెండు పార్టీలు స్పీకర్ పదవి తమకే కావాలని కోరుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే కేంద్ర మంత్రివర్గంలో హోం, రక్షణ, ఆర్థికశాఖలతోపాటు స్పీకర్ పదవిని తమవద్దే అట్టిపెట్టుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలిసింది. కాబట్టి ఇతర పార్టీలకు స్పీకర్ పదవి దక్కకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. బీజేపీనే స్పీకర్ పదవి చేపడితే రాజస్థాన్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఓం బిర్లాకే మరోసారి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.
అయితే మరోవైపు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరు కూడా ప్రచారంలో ఉంది. అలాగని వీరిద్దరిలో ఎవరో ఒకరిని స్పీకర్ పదవి వరిస్తుందని కూడా కచ్చితంగా చెప్పలేం. వీరిద్దరూ కాకుండా అనూహ్యంగా వేరెవరి పేరైనా తెరపైకి వచ్చినా పెద్దగా ఆశ్యర్యపోనక్కర్లేదు. జూన్ 18న లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. అదేగనుక జరిగితే జూన్ 20 కల్లా స్పీకర్ పోస్టుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.