BJP | న్యూఢిల్లీ, జూన్ 6: తాజా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది. 2019లో 303 సీట్లు సాధించిన ఈ పార్టీ ఈసారి 240 సీట్ల వద్దనే ఆగిపోయింది. అంటే గతంలో కన్నా 63 సీట్లు తగ్గాయి. అయితే ఓట్లపరంగా చూస్తే ఈ తేడా చాలా స్వల్పంగా ఉన్నది. 2019 ఎన్నికల్లో బీజేపీ 37.7 శాతం ఓట్లు పొందగా, ఈసారి 36.56 శాతం ఓట్లు సాధించింది. అంటే కేవలం 1.20 శాతం ఓట్లు మాత్రమే తగ్గాయి.
అయినప్పటికీ 63 సీట్లను కోల్పోయింది. యూపీలో ఓటింగ్ గణాంకాలు 2019 మాదిరిగానే కన్పించినప్పటికీ ఇండియా కూటమి పార్టీల మధ్య పొత్తు కమలం పార్టీని దారుణంగా దెబ్బతీసింది. ఇక దక్షిణాదిన ఆ పార్టీ ఓటింగ్ శాతాన్ని పెంచుకున్పప్పటికీ ఆశించిన స్థాయిలో సీట్లు పెరగలేదు. ఉదాహరణకు తమిళనాడులో ఓట్ల శాతం 10 శాతానికి పెరిగినా, ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.
కాంగ్రెస్ విషయంలో దానికి వ్యతిరేకంగా జరిగింది. ఆ పార్టీకి 2019లో 19.70 శాతం ఓట్లు రాగా, 2024లో 21.19 శాతం ఓట్లు వచ్చాయి. పెరిగిన ఓట్లు 1.49 శాతమే. కానీ సీట్లు దాదాపు రెట్టింపై 52 నుంచి 99కి చేరాయి.