న్యూఢిల్లీ, మే 12: బీజేపీలో మోదీ తీసుకొచ్చిన ’75 ఏండ్ల’ నిబంధన అనేది కేవలం ఎల్కే అద్వానీ వంటి నేతలకేనా, మోదీకి వర్తించదా? అని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఈ నిబంధనను తాను పాటిస్తారా? లేదా? అనేదానిపై మోదీ ఇప్పటి వరకు ఒక్క ప్రకటన కూడా చేయలేదని, దీనిపై ఆయన స్పష్టత ఇవ్వాలని ఆదివారం డిమాండ్ చేశారు.
75 ఏండ్ల నిబంధన మోదీకి వర్తించదంటూ తన వ్యాఖ్యలను ఖండిస్తున్న బీజేపీ నేతలు.. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే, యూపీలో సీఎం యోగిని తొల గిస్తారని తాను చేసిన వ్యాఖ్యలను ధ్రువీకరించారని కేజ్రీవాల్ అన్నారు. తనను అరెస్టు చేసిన తర్వాత ఢిల్లీ, పంజాబ్లలో ఆప్ ప్రభుత్వాలను కూల్చాలని బీజేపీ కుట్రలు చేసిందని, అయితే అవి ఫలించలేదని కేజ్రీవాల్ అన్నారు.
10 హామీలు ప్రకటించిన కేజ్రీవాల్
మరోవైపు ఎన్నికల నేపథ్యంలో ‘కేజ్రీవాల్కీ గ్యారెంటీ’ పేరుతో 10 హామీలను విడుదల చేశారు. 24 గంటల విద్యుత్తు సరఫరా, నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, పంటలకు కనీస మద్దతు ధర, అగ్నివీర్ స్కీమ్ రద్దు తదితర హామీలను నెరవేరుస్తామని ఆయన పేర్కొన్నారు. ఆప్ గెలిస్తే మళ్లీ తాను జైలుకు వెళ్లాల్సిన అవసరం రాదన్నారు.