Lok Sabha Elections | న్యూఢిల్లీ, మార్చి 16: దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగింది. లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరుగనున్నది. జూన్ 1న చివరి దశ ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 4న కౌంటింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈసీ) రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. 13 రాష్ర్టాల్లోని 26 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకూ ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.
లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో భాగంగా మే 13న తెలంగాణలోని 17 స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం ఏడు దశల్లోనూ లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న రాష్ర్టాల జాబితాలో ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్ ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మీడియా సమావేశంలో సీఈసీ రాజీవ్ కుమార్‌తోపాటు కొత్త కమిషనర్లుగా నియమితులైన జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌తో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ర్టాల్లోనూ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఏపీ అసెంబ్లీకి పార్లమెంట్ ఎన్నికల నాలుగో విడత జరిగే మే 13న ఒకే దశలో ఎన్నికలు జరుగనున్నాయి. 60 అసెంబ్లీ సీట్లు ఉన్న అరుణాచల్‌ప్రదేశ్, 32 స్థానాలు ఉన్న సిక్కింలో ఏప్రిల్ 19న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఒడిశాలో(147 స్థానాలు) మాత్రం నాలుగు విడతలుగా(మే 13, 20, 25, జూన్ 1) అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్నారు.
భారతదేశ ప్రజాస్వామ్య పండుగ నిర్వహణకు ఎన్నికల సంఘం పూర్తి సంసిద్ధంగా ఉన్నదని సీఈసీ రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ ఏడాది (2024) ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల సంవత్సరమని, అందులోనూ భారతదేశ ఎన్నికలు ఒక ధ్రువతార వంటివని, ప్రపంచ దృష్టంతా మనపైనే ఉంటుందని అన్నారు. ఇప్పుడు మా బృందం(కొత్త కమిషనర్ల నియామకాన్ని ఉద్దేశిస్తూ) నిండుగా ఉన్నదని, ప్రపంచ వేదికపై భారత ప్రభను మరింత పెంచే విధంగా లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఓటింగ్ శాతం పెంచడం, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యమని తెలిపారు. ధన బలం, అంగ బలం, తప్పుడు సమాచారం, ఎన్నికల నియమావళిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో డ్రోన్ ఆధారిత తనిఖీలు చేపడుతామని, నాన్ చార్టెడ్ విమానాలపై నిఘా ఉంచుతామని, తప్పుదోవ పట్టించే ప్రకటనలు, ఫేక్ న్యూస్‌పై ఉక్కుపాదం మోపుతామని, ఎన్నికల హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకొంటామని తెలిపారు.
లోక్‌సభ, నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా దేశవ్యాప్తంగా 13 రాష్ర్టాల్లోని 26 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలకు కూడా ఈసీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి నాలుగో విడతలో భాగంగా మే 13న ఉప ఎన్నిక జరుగుతుందని ప్రకటించింది. ఉప ఎన్నికలు జరుగనున్న 26 స్థానాల్లో ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లో అనర్హత వేటుకు గురైన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల స్థానాలు కూడా ఉన్నాయి. ఇంకా, గుజరాత్లో 5, యూపీ-4, పశ్చిమబెంగాల్-2, బీహార్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, త్రిపుర, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడులో ఒక్కొక్క స్థానం చొప్పున ఉన్నాయి. ఆయా స్థానాల్లో ఎమ్మెల్యేల రాజీనామాలు, పార్టీ మార్పులు, పలువురికి జైలు శిక్షల కారణంగా ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
లోక్‌సభ ఎన్నికలు పూర్తైన తర్వాత జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. భద్రత దృష్ట్యా జమ్ముకశ్మీర్‌లో ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఆయన అన్నారు. జమ్ముకశ్మీర్‌లో ప్రతి అభ్యర్థికి సెక్యూరిటీని కేటాయించాల్సి ఉంటుందని, దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలో అది కుదరదని పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తర్వాత గత ఏడాది డిసెంబర్లో జమ్ముకశ్మీర్ పునర్వ్యస్థీకరణ చట్టాన్ని సవరించారని, ఆ తర్వాతి నుంచే ఎన్నికల సంఘం సమయం ప్రారంభమైందని అన్నారు.
పోలింగ్ కోసం వినియోగించే ఈవీఎంలపై వస్తున్న పలు అనుమానాలపై సీఈసీ రాజీవ్ కుమార్ స్పందించారు. ఈవీఎంలు 100 శాతం సురక్షితమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లపై దేశంలోని వివిధ కోర్టులు విచారణ చేపట్టాయని, ప్రతిసారీ ఆయా పిటిషన్లను కోర్టులు తిరస్కరించాయని అన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి వస్తున్న ఫిర్యాదుల విషయంలో ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలను సీఈసీ తిరస్కరించారు. అన్ని ఫిర్యాదులను తీసుకొంటున్నామని పేర్కొన్నారు. కాగా, పలు ఈవీఎంలను అనుసంధానం చేసే, ఫలితాలను కలిపేసే, బూత్‌ల వారీగా ఓటింగ్ సరళిని దాచే కొత్త సాంకేతికత కేంద్ర ఎన్నికల సంఘం వద్ద సిద్ధంగా ఉన్నదని, అయితే దాన్ని అమలు చేసే సమయం ఇంకా రాలేదని అన్నారు.
ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ ఆకస్మిక రాజీనామాకు గల కారణంపై సీఈసీ రాజీవ్ కుమార్ సూటిగా సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన రాజీనామా చేసివుంటే, దాన్ని మనం గౌరవించాల్సి ఉందన్నారు. ఎన్నికల సంఘంలో భిన్నాభిప్రాయాలను గౌరవిస్తామని, ఒకటి నుంచి మూడు ఆలోచనలు మెరుగైనవని అన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా 85 ఏండ్లు పైబడిన వృద్ధులు, 40 శాతానికి పైగా వైకల్యం ఉన్న వారికి ‘ఇంటి నుంచే ఓటు’ వేసే అవకాశం కల్పించినట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. 85 ఏండ్ల పైబడిన వారి నుంచి ఇంటి నుంచి ఓటు తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందు కోసం నామినేషన్ల కంటే ముందే ఓటు వేసే విధానాన్ని ఎంచుకొనేందుకు వారి ఇండ్లకు 12డీ ఫారంను పంపుతామని తెలిపారు. ‘ఇంటి నుంచే ఓటు’ విధానాన్ని ఎంచుకొంటే, వారి ఇంటి వద్దనే ఓటింగ్ నిర్వహిస్తామని వివరించారు. ఈ ప్రక్రియను ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించామని, లోక్‌సభ ఎన్నికల్లో అమలు చేయడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు అడ్వైజరీ జారీచేసింది. ప్రచారం సమయంలో నిబంధనలను అతిక్రమించొద్దని, విద్వేష ప్రసంగాలు చేయొద్దని సూచించింది.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున సామాన్య ప్రజానీకం రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లేపక్షంలో తప్పనిసరిగా తమ వెంట ఆధారాలు తీసుకెళ్లాలి. ఆధారాలు లేకుంటే నగదును అధికారులు సీజ్ చేస్తారు.
నోటిఫికేషన్ విడుదల : ఏప్రిల్ 18
నామినేషన్‌కు చివరితేదీ : ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన : ఏప్రిల్ 26
ఉపసంహరణకు చివరితేదీ : ఏప్రిల్ 29
పోలింగ్ తేదీ : మే 13
ఓట్ల లెక్కింపు : జూన్ 4
ఎన్నికల భద్రతకు మోహరించనున్న కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు 3.4 లక్షల మంది
రాజకీయ హింస ఎక్కువగా ఉన్న పశ్చిమబెంగాల్‌కు 92,000
ఉగ్రవాద ప్రభావిత జమ్ముకశ్మీర్‌కు 63,500
నక్సల్స్ ప్రభావిత ఛత్తీస్‌గఢ్‌కు 36,000
బీహార్ 295
యూపీ 252
ఏపీ 250
గుజరాత్ 200
తెలంగాణ 160
ఒక్కో సీఏపీఎఫ్ కంపెనీలో 100 మంది సిబ్బంది ఉంటారు.
దేశంలో ఓటర్లు 97.8 కోట్లు
దేశవ్యాప్తంగా పోలింగ్ స్టేషన్లు 10.5 లక్షలు
పోలింగ్ సిబ్బంది 1.5 కోట్ల మంది
ఈవీఎంలు 55 లక్షలు
ఎన్నికల భద్రతకు మోహరించనున్న సాయుధ పోలీస్ బలగాలు 3.4 లక్షల మంది
మొత్తం ఓటర్లు : 97.8 కోట్లు
పురుషులు : 49.72 కోట్లు
మహిళలు: 47.1 కోట్లు
ట్రాన్స్జెండర్లు : 48 వేలు
మొదటిసారి ఓటు హక్కు పొందిన వారు: 1.82 కోట్లు
85 ఏండ్లు పైబడినవారు: 82 లక్షలు
తొలి దశ-ఏప్రిల్ 19 (102 స్థానాలు)తమిళనాడు(39), రాజస్థాన్(12), ఉత్తరప్రదేశ్(8), మధ్యప్రదేశ్(6), మహారాష్ట్ర(5), ఉత్తరాఖండ్(5), అస్సాం(5), బీహార్(4), పశ్చిమబెంగాల్(3), అరుణాచల్‌ప్రదేశ్(2), మణిపూర్(2), మేఘాలయ(2), ఛత్తీస్‌గఢ్(1), మిజోరం(1), నాగాలాండ్(1), సిక్కిం(1), త్రిపుర(1), అండమాన్ నికోబార్(1), జమ్ముకశ్మీర్(1), లక్షద్వీప్(1), పుదుచ్చేరి(1)
కేరళ(20), కర్ణాటక(14), రాజస్థాన్(13), మహారాష్ట్ర(8), ఉత్తరప్రదేశ్(8), మధ్యప్రదేశ్(7), అస్సాం (5), బీహార్(5), ఛత్తీస్‌గఢ్(3), బెంగాల్(3), మణిపూర్(1), త్రిపుర(1), జమ్ముకశ్మీర్(1)
గుజరాత్(26), కర్ణాటక(14), మహారాష్ట్ర(11), ఉత్తరప్రదేశ్(10), మధ్యప్రదేశ్(8), ఛత్తీస్‌గఢ్(7), బీహార్(5), పశ్చిమబెంగాల్(4), అస్సాం(4), గోవా(2), దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ(2), జమ్ముకశ్మీర్(1)
ఏపీ(25), తెలంగాణ(17), యూపీ (13), మహారాష్ట్ర(11), ఎంపీ(8), బెంగాల్(8), బీహార్(5), జార్ఖండ్ (4), ఒడిశా(4), జమ్ముకశ్మీర్(1)
ఉత్తరప్రదేశ్(14), మహారాష్ట్ర(13), పశ్చిమబెంగాల్(7), బీహార్(5), ఒడిశా(5), జార్ఖండ్(3), జమ్ముకశ్మీర్(1), లడఖ్(1)
ఉత్తరప్రదేశ్(14), హర్యానా(10), పశ్చిమబెంగాల్(8), బీహార్(8), ఢిల్లీ(7), ఒడిశా(6), జార్ఖండ్(4)
ఉత్తరప్రదేశ్(13), పంజాబ్(13),పశ్చిమబెంగాల్(9),బీహార్(8), ఒడిశా (6), హిమాచల్‌ప్రదేశ్(4), జార్ఖండ్ (3), చండీగఢ్(1).
ఫలితాలు: జూన్ 4