న్యూఢిల్లీ: జూలై 28 : పహల్గాం ఉగ్రదాడి, ‘ఆపరేషన్ సిందూర్’పై సోమవారం లోక్‌సభలో వాడీవేడి చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రశ్నల వర్షం కురిపించాయి. ‘ఆపరేషన్ సిందూర్’లో ఎన్ని భారతీయ యుద్ధ విమానాలు కూలిపోయాయి? ప్రధాని మోదీ ఎవరికి లొంగిపోయారు? అని నిలదీశాయి. పహల్గాం ఉగ్రదాడికి దారి తీసిన భద్రతా లోపాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశాయి. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉప నేత గౌరవ్ గొగోయ్ చర్చలో పాల్గొంటూ, భూభాగాన్ని ఆక్రమించుకోవడం తమ ఉద్దేశం కాదని ప్రభుత్వం చెప్తున్నదని, పాక్ ఆక్రమిత కశ్మీరును ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఎందుకు అనుకోవడం లేదని నిలదీశారు. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించే విధంగా వాణిజ్యాన్ని అస్త్రంగా ఉపయోగించానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 26 సార్లు చెప్పారన్నారు. ఐదు నుంచి ఆరు యుద్ధ విమానాలు కూలిపోయాయని, వాటిలో ఒకదాని విలువ కోట్లాది రూపాయలు ఉంటుందని చెప్పారని గుర్తు చేశారు. అందుకే తాము రక్షణ మంత్రిని అడుగుతున్నామని, ఎన్ని యుద్ధ విమానాలు కూలిపోయాయో సమాధానం చెప్పాలన్నారు. భారత్ ముందు మోకరిల్లడానికి పాక్ సిద్ధంగా ఉన్నట్లయితే, మీరు ఎందుకు ఆగిపోయారు? ఎవరి ముందు మీరు లొంగిపోయారు? అని నిలదీశారు.
టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ, యావత్తు దేశం ప్రధాని మోదీకి మద్దతుగా నిలిచిన సమయంలో ‘ఆపరేషన్ సిందూర్’ను నిలిపేయడం సెంచరీకి చేరువలో ఉన్న ప్లేయర్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసినట్లుగా ఉందని దుయ్యబట్టారు. ట్రంప్ ముందు మోదీ స్థాయి తగ్గిపోయిందని, మోదీ ఛాతీ 56 అంగుళాల నుంచి 36 అంగుళాలకు కుంచించుకుపోయిందని ఎద్దేవా చేశారు. శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ మాట్లాడుతూ, కాల్పుల విరమణ కోసం మోకరిల్లిన పాకిస్థాన్‌కు షరతులు విధించకుండా ఆపరేషన్ సిందూర్‌ను ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు. పీఓకేని స్వాధీనం చేసుకోకుండా ఎవరు ఆపారని నిలదీశారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామశంకర్ రాజ్‌భర్ ఈ ప్రత్యేక చర్చలో పాల్గొంటూ, పహల్గాం ఉగ్రదాడికి బాధ్యులైన ఉగ్రవాదులను రోస్ట్ చేయడానికి ‘ఆపరేషన్ తందూర్’ కావాలి కానీ ‘ఆపరేషన్ సిందూర్’ కాదన్నారు.
‘ఆపరేషన్ సిందూర్’పై లోక్ సభలో ప్రత్యేక చర్చను సోమవారం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రస్తుతం విరామం ఇచ్చామని చెప్పారు. కోరుకున్న లక్ష్యాలను మన రక్షణ దళాలు సాధించాయని తెలిపారు. ఈ మిలిటరీ యాక్షన్ ద్వారా ఉగ్రవాద మద్దతుదారులకు స్పష్టమైన సందేశం వెళ్లిందన్నారు. శత్రువులు తమ వ్యూహంలో భాగంగా ఉగ్రవాదాన్ని ప్రయోగిస్తే, శాంతియుత భాషను అర్థం చేసుకోకపోతే, భారత్ గట్టిగా నిలబడుతుందని, నిర్ణయాత్మకంగా వ్యవహరించడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ, అమెరికాతో జరిపిన చర్చల్లో ఏ దశలోనూ ‘ఆపరేషన్ సిందూర్’కు వాణిజ్యంతో సంబంధం లేదని చెప్పారు. సైనిక చర్యను ఆపాలని పాకిస్థాన్ వైపు నుంచి డీజీఎంఓ చానల్ ద్వారా విజ్ఞప్తి వచ్చిందని తెలిపారు.
తాను సకాలంలో జోక్యం చేసుకుని ఉండకపోతే, భారత్, పాక్ ఇప్పటికీ యుద్ధం చేసుకుంటూనే ఉండేవని ట్రంప్ మరోసారి చెప్పారు. అన్ని రకాల వాణిజ్య చర్చలను నిలిపేస్తానని తాను బెదిరించానన్నారు. బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్తో కలిసి స్కాట్లండ్‌లో మీడియాతో ట్రంప్ మాట్లాడారు.