న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా వ్యవహారం నేపథ్యంలో లాగిన్ ఐడీ వినియోగంపై ఎంపీలకు లోక్‌సభ సెక్రటేరియట్ తాజాగా పలు సూచనలు జారీచేసింది. పోర్టల్‌ను ఎంపీలు మాత్రమే యాక్సెస్ చేయాలని, లాగిన్ ఐడీలను ఎవరికీ ఇవ్వొద్దని స్పష్టం చేసింది. ఎంపీలు అడిగే ప్రశ్నలకు ప్రశ్నోత్తరాల సమయం కంటే కొంచెం ముందుగా వారి పోర్టల్ లాగిన్లకు పంపే సమాధానాల విషయంలో గోప్యత పాటించాలని నొక్కిచెప్పింది.
ఎంపీలు అడిగే స్టార్డ్, అన్ స్టార్డ్ ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చే సమాధానాలు లాగిన్, పాస్‌వర్డ్‌లతో రక్షణ కల్పించబడి ఉంటుందని, సభలో ప్రశ్నోత్తరాల సమయం పూర్తయ్యే వరకు వాటిపై గోప్యత పాటించాలని, కంటెంట్‌ను ఎవరితో షేర్ చేసుకోవద్దని లోక్‌సభ సెక్రటేరియట్ ఈ నెల 10న ఇచ్చిన బులెటిన్‌లో స్పష్టం చేసింది. గోప్యత విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలనే మహువా ఎపిసోడ్ నేపథ్యంలో లోక్‌సభ పునరుద్ఘాటించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ నుంచి ఎంపీ మహువాను బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసిన తర్వాతి రోజునే తాజా సూచనలు జారీ అయ్యాయి.