న్యూఢిల్లీ: అదానీ అంశం(Adani Issue)పై ఇవాళ కూడా పార్లమెంట్లో దుమారం రేగింది. ఉభయసభలను ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. ఎటువంటి సభా కార్యక్రమాలు నిర్వహించకుండానే వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభ(Loksabha) ప్రారంభం కాగానే.. విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లి ఆందోళనలు చేపట్టారు. స్పీకర్ ఓం బిర్లా(Om Birla) సభ్యులను శాంతింప చేసే ప్రయత్నం చేశారు. సభను నడిపించాలనుకుంటున్నానని, అందరికీ అవకాశం ఇస్తానన్నారు. కానీ సభ ఆర్డర్లో ఉండాలన్నారు. సభ సజావుగా సాగాలన్నారు. ప్రతి సభ్యుడికి సమయం ఇచ్చానన్నారు. అయినా కానీ విపక్ష సభ్యులు వినలేదు. వెల్‌లోకి దూసుకువెళ్లి నిరసన కొనసాగించారు.
హౌజ్ ఆర్డర్‌లోకి వస్తే, అవకాశం కల్పిస్తానని ఓం బిర్లా అన్నారు. సీటులోకి వెళ్లి కూర్చోవాలన్నారు. అధికార, విపక్ష సభ్యుల(Opposition Members)ను కూర్చోవాలని ఆయన కోరారు. కానీ విపక్ష సభ్యులు ఎంతకీ వినకపోవడంతో ఆయన సభను రెండు గంటల వరకు వాయిదా వేశారు. అదానీ అంశంపై జేపీసీ(JPC) వేసి విచారణ చేపట్టాలని, ఈ అంశంపై డిస్కస్ చేయాలని బీఆర్ఎస్(BRS)తో పాటు ఇతర విపక్షాలు డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానాన్ని ఇచ్చాయి.
ఇక రాజ్యసభ(Rajyasabha)లోనూ విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు. రూల్ 267 కింద బిజినెస్‌ను సస్పెండ్ చేసి అదానీ జేపీసీ అంశంపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్(Ranjit Ranjan) తెలిపారు. కార్పొరేట్ ఫ్రాడ్, పొలిటికల్ కరప్షన్, స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్, ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అంశాలపై అదానీని విచారించాలని రంజన్ తన నోటీసులో కోరారు. దేశంలో భావ స్వేచ్ఛ లేకుండా పోయిందని, ఈ అంశంపై చర్చించాలని డాక్టర్ సయ్యిద్ నసీర్ హుసేన్ డిమాండ్ చేశారు.