Budget Sessions | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Budget Sessions) రేపటికి వాయిదా పడ్డాయి (adjourned). ఇవాళ ఉదయం ప్రారంభమైన సమావేశాల్లో ముందుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం బడ్జెట్ సమర్పించడానికి ముందు గత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన ఆర్థిక సర్వేను (Economic Survey 2024-25) కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్సభలో (Lok Sabha) ప్రవేశపెట్టారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఆ తర్వాత నిర్మలమ్మ ఆర్థిక సర్వేను రాజ్యసభ (Rajya Sabha) ముందుకు తీసుకెళ్లారు. అనంతరం స్పీకర్ జగదీప్ ధన్ఖర్ సభను రేపటికి వాయిదా వేశారు. ఉభయసభలు రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. శనివారం ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2025-26) బడ్జెట్ను నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం (ఇవాళ్టి) నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఏప్రిల్ 4 వరకు రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. మొదటి విడత సమావేశాలు ఫిబ్రవరి 13న ముగుస్తాయి. ఇక రెండో విడుత సమావేశాలు మార్చి 10న మొదలై.. ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. వక్ఫ్(సవరణ) బిల్లు, బ్యాంకింగ్ చట్టాల(సవరణ) బిల్లు, రైల్వే(సవరణ) బిల్లు, విపత్తు నిర్వహణ(సవరణ) బిల్లుతో పాటు వలస, విదేశీయుల బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఈ నేపథ్యంలో గురువారం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంటరీ కమిటీల్లో మెజార్టీని ఉపయోగించి అజెండాను కేంద్రం బలవంతంగా రుద్దుతున్నదని విపక్షాలు ఆరోపించాయి.
Also Read..
Economic Survey | పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే.. ఉభయసభల్లో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
PM Modi | దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్ ఉంటుంది : ప్రధాని మోదీ