Jamili Elections | న్యూఢిల్లీ, డిసెంబర్ 20 : జమిలి ఎన్నికలకు వీలు కల్పించే రెండు బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి పంపిస్తూ శుక్రవారం లోక్‌సభలో తీర్మానం చేశారు. అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఉదయం సభ ప్రారంభం కాగానే ఇండియా కూటమి సభ్యులు నినాదాలు ప్రారంభించారు. వీరి ఆందోళన కొనసాగుతుండగానే న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తీర్మానం ప్రవేశపెట్టగా, ముజువాణీ ఓటు ద్వారా ఆమోదం పొందినట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం సభను నిరవదిక వాయిదా వేశారు.
39 మంది సభ్యులతో జేపీసీ ఏర్పాటైంది. మొదట 31 మంది సభ్యులతో జేపీసీ వేయాలని నిర్ణయించగా, ఎక్కువ పార్టీలకు చోటు కల్పించేందుకు సభ్యుల సంఖ్యను 39కి పెంచారు. కమిటీలో బీజేపీ నుంచి 16 మందికి, కాంగ్రెస్ నుంచి ఐదుగురికి, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే నుంచి ఇద్దరు చొప్పున, శివసేన, టీడీపీ, జేడీయూ, ఆర్ఎల్డీ, ఎల్జేఎస్పీ(ఆర్వీ), జేఎస్పీ, శివసేన(యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ), సీపీఎం, ఆప్, బీజేడీ, వైసీపీ నుంచి ఒకరి చొప్పున చోటు దక్కింది. ఈ కమిటీకి చైర్మన్‌గా బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి పీపీ చౌధరిని స్పీకర్ ఓం బిర్లా నియమించారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిశాయి. శుక్రవారం జమిలి బిల్లులను జేపీసీకి పంపుతూ తీర్మానం చేసిన తర్వాత లోక్‌సభను స్పీకర్ ఓం బిర్లా నిరవధిక వాయిదా వేశారు. జేపీసీకి 12 మంది సభ్యులను సిఫార్సు చేస్తూ రాజ్యసభలో తీర్మానం చేసిన తర్వాత సభను చైర్మన్ జగ్దీప్ ధన్కడ్ నిరవధిక వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, నవంబర్ 25 ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు అంతరాయాలు, వాయిదాలతో కొనసాగాయి. రాజ్యాంగం 75 ఏండ్ల ప్రస్థానంపై ఉభయసభల్లో చర్చ జరిగింది. కాగా, లోక్‌సభ ఉత్పాదకత 57.87 శాతమని, రాజ్యసభ ఉత్పాదకత 40.03 శాతమని అధికార వర్గాలు తెలిపాయి. కమిటీ చైర్మన్‌గా బీజేపీ ఎంపీ పీపీ చౌదరి నియమితులయ్యారు.