(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఓంకారేశ్వర క్షేత్ర పవిత్రతను దెబ్బ తీయడానికి బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకొన్నది. మధ్యప్రదేశ్‌లోని మాంధాత పర్వతంపై ‘స్టాట్యూ ఆఫ్ వన్నెస్’ (ఏకత్వ విగ్రహం) ఏర్పాటు పనులపై విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ, అవేమీ పట్టించుకోకుండా యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేస్తున్నది. గత జూలైలో ఈ ప్రాజెక్టుపై మధ్యప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. ఆధ్యాత్మిక క్షేత్రాన్ని పిక్నిక్ స్పాట్‌గా మార్చవద్దని స్థానిక సనాతన ధర్మ గురువులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా వీటిని శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కారు చెవికెక్కించుకోవట్లేదు.
మధ్యప్రదేశ్‌లో మూడేండ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి దొడ్డిదారిన గద్దె నెక్కిన బీజేపీకి ఈ నవంబర్‌లో జరిగే ఎన్నికలు సవాల్‌గా మారాయి. అభివృద్ధి కార్యాచరణలో దారుణంగా విఫలమైన కమల దళానికి ఎన్నికల వేళ మళ్లీ మతం గుర్తుకు వచ్చింది. దీంతో ఆరేండ్ల కిందట ప్రకటించిన ఏకత్వ విగ్రహం పనులను మళ్లీ ముందేసుకొన్నది. 108 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి 2017లో శివరాజ్‌సింగ్ సర్కారు నిర్ణయించింది. దీంతోపాటు ఏకాత్మ ధామ్, అద్వైత లోక్ మ్యూజియమ్, ఇన్ఫర్మేషన్ సెంటర్, లేజర్ షో, నౌకా విహార్, వేదిక్ గురుకుల్, రెస్టారెంట్స్ కూడా నిర్మించతలపెట్టింది. దీనికోసం ఏకంగా రూ. 2,141 కోట్లను కేటాయించింది. అయితే విగ్రహ ప్రతిష్ఠకు మాంధాత పర్వతాన్ని ఎంపిక చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మాంధాత పర్వతంపై శివుడు సశరీరంగా నడయాడాడని ప్రతీతి. అందుకే ఈ పర్వతానికి, దాని పవిత్రతకు ఎలాంటి విఘాతం కలుగకుండా, వేరేచోట విగ్రహ ప్రతిష్ఠ చేయాలని హిందూ ధార్మికవేత్తలు, ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. ప్రాజెక్టును వేరే ప్రాంతంలో చేపట్టాలని ఇప్పటికే పలు ఎన్జీవోలు 50 వేల మందితో సంతకాలు తీసుకొన్నాయి. దీంతో ప్రాజెక్టు పనులపై కోర్టు కూడా స్టే విధించింది. అయితే, ఇవేమీ పట్టించుకోని ప్రభుత్వం బుల్డోజర్లతో పవిత్రమైన మాంధాత గిరిని తొలుస్తున్నది. ‘రాజకీయ ప్రయోజనాలకు జ్యోతిర్లింగం కొలువైన ఈ పవిత్ర స్థలాన్ని పిక్నిక్ స్పాట్‌గా మారుస్తారా?’ అంటూ లోక్‌హిత్ జన్వాదీ సమితి న్యాయవాది త్రిపతి ధ్వజమెత్తారు.
విగ్రహం పేరు: స్టాట్యూ ఆఫ్ వన్నెస్
విగ్రహం ఎత్తు: 108 అడుగులు
ప్రతిష్ఠించనున్న ప్రాంతం: ఓంకారేశ్వర పర్వతం
విగ్రహానికి ఖర్చు: రూ. 200 కోట్లు
విగ్రహం ప్రారంభం: సెప్టెంబర్, 2023
మిగతా ప్రాజెక్టు ప్రారంభం: 2026
హిందువులు పరమ పవిత్రంగా భావిస్తున్న మాంధాత పర్వతాన్ని బుల్డోజర్లతో తవ్వడం సరికాదు. హిందూ పక్షపాత పార్టీగా చెప్పుకొనే బీజేపీ.. రాజకీయ ప్రయోజనాలకు ఇలా చేయడం దారుణం.
– మునీందర్ దాస్ కబీర్, మత గురువు, మాంధాత క్షేత్రం