Census 2025 | న్యూఢిల్లీ, అక్టోబర్ 28: దేశంలో జనగణన నిర్వహించేందుకు ఎట్టకేలకు అడుగులు పడుతున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో జనాభా లెక్కల సేకరణ మొదలు కానున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. జనగణనతో పాటు జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్పీఆర్)ను అప్డేట్ చేయనున్నట్టు, ఈ డాటాను 2026లో ప్రకటించనున్నట్టు పేర్కొన్నాయి. అయితే, ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. జనాభా లెక్కల సేకరణలో భాగంగా దేశప్రజలను అడిగేందుకు రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్ కార్యాలయం 31 ప్రశ్నలు సిద్ధం చేసినట్టు సమాచారం. గతంలో అడిగినట్టుగా కుటుంబ పెద్ద లేదా సభ్యులు ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వారా? అనే ప్రశ్న సైతం ఇందులో ఉన్నట్టు తెలుస్తున్నది. కాగాదేశంలో అన్ని కులాల జనాభాను లెక్కించేందుకు జనగణనతో పాటు కులగణన సైతం చేపట్టనున్నారా అనే విషయమై ఇంకా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని తెలుస్తున్నది.
2026లోనే పునర్విభజన చేపట్టాల్సి ఉన్నా..
జనగణన పూర్తయిన తర్వాత లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని, 2028 నాటికి ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, కొత్త జనాభా లెక్కల ఆధారంగా రాష్ర్టాల లోక్‌సభ స్థానాల సంఖ్యను నిర్ణయిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇలా చేస్తే దేశ ప్రయోజనాల దృష్ట్యా జనాభా నియంత్రణ పద్ధతులను సమర్థంగా పాటిస్తున్న దక్షిణాది రాష్ర్టాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఇక్కడ సీట్ల సంఖ్య తగ్గిపోయి ఉత్తరాది రాష్ర్టాల్లో గణనీయంగా పెరుగుతుందని ఇప్పటికే ఇక్కడి నేతలు వాపోతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి 2026లోనే నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉన్నప్పటికీ, 2029లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ముందు పునర్విభజన చేపట్టాలని కేంద్రం నిర్ణయించటం గమనార్హం.
కులగణనపై స్పష్టత ఇవ్వండి: కాంగ్రెస్
జనగణనలో భాగంగా అన్ని కులగణన కూడా చేస్తారా అనేది స్పష్టత ఇవ్వాలని, ఇందుకు గానూ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ‘రెండు కీలక అంశాలపై స్పష్టత రాలేదు. ఎస్సీ, ఎస్టీ జనాభా సంఖ్యను గుర్తించడంతో పాటు అన్ని కులాల సంఖ్యను కూడా లెక్కిస్తారా? జనాభా లెక్కల ఆధారంగా రాష్ర్టాల లోక్‌సభ సీట్ల సంఖ్యను నిర్ణయిస్తారా?’ అని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ప్రశ్నించారు.
మారనున్న జనగణన సైకిల్
దేశంలో తొలిసారి 1872లో జనగణన జరిగింది. స్వాత ంత్య్రం వచ్చిన తర్వాత 1951 నుంచి ప్రతి పదేండ్లకు ఒకసారి జనగణన జరుగుతున్నది. చివరగా 2011లో నిర్వహించారు. 2021లో జనాభా లెక్కల సేకరణ జరగాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నది. అయితే, ఇక నుంచి జనగణన సైకిల్‌ను కూడా మార్చనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. వచ్చేసారి జనాభా లెక్కింపు 2035, ఆ తర్వాత 2045లో జరుగుతుందని, భవిష్యత్తులో ఇలానే ప్రతి పదేండ్లకు ఒకసారి చేపట్టనున్నట్టు వెల్లడించాయి.