బెంగళూరు, నవంబర్ 6: వరుస అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తాజాగా మద్యం వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి ఆర్బీ తిమ్మాపుర్ కొన్ని వందల కోట్ల అవినీతికి పాల్పడినట్టు కర్ణాటక వైన్ మర్చంట్స్ అసోసియేషన్ (కేడబ్ల్యూఎంఏ) తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ అవినీతి, ఎక్సైజ్ శాఖ అక్రమాలను నిరసిస్తూ ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులను మూసివేస్తామని ప్రకటించింది. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన ఎక్సైజ్ శాఖను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది.
700 కోట్ల స్కామ్..
ఎక్సైజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికి పైగా సీఎల్7 బార్ లైసెన్స్‌లను హోటళ్లు, కొన్ని బోర్డింగ్ గృహాలకు మంజూరు చేసిందని అసోసియేషన్ అధ్యక్షుడు గురుస్వామి, ప్రధాన కార్యదర్శి బీ గోవింద్ రాజ్ తెలిపారు. ఒక్కో లైసెన్స్ మంజూరుకు రూ. 30 లక్షల నుంచి 70 లక్షలు లంచంగా తీసుకున్నారని, వాస్తవానికి వీటిని ఏర్పాటు చేయడానికి 4 నుంచి 8.5 లక్షల ఫీజు మాత్రమే వసూలు చేయాలని వారు చెప్పారు. ఇలా రూ. 300 కోట్ల నుంచి 700 కోట్ల వరకు మంత్రి తిమ్మాపుర్ వీటిని వసూలు చేశారని వారు ఆరోపించారు. అంతేకాకుండా ఎక్సైజ్ శాఖలో ఉన్నత స్థానాల్లో బదిలీల కోసం 25 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు లంచంగా వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు.